కరోనా టీకా తీసుకున్న వాలంటీర్ మృతి

4

కరోనా టీకా వికటించిన కారణంగా ఓ వాలంటీర్ ప్రాణాలు కోల్పోయింది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలిత వాలంటీర్ గా పనిచేస్తోంది. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సినేషన్ ఇస్తున్న క్రమంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ వాలంటీర్లకు కూడా టీకా పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో లలిత టీకా వేయించుకుంది. అయితే, అప్పటినుంచి అనారోగ్యానికి గురైంది. చివరకు తీవ్ర అస్వస్థతకు లోనై ప్రాణాలు కోల్పోయింది.

వ్యాక్సిన్ తీసుకునే వరకు ఆమెకు ఎలాంటి సమస్యా లేదని.. అది తీసుకున్న తర్వాతే అనారోగ్యానికి గురై మరణించిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. టీకా వికటించిన కారణంగా తమ కుమార్తె చనిపోయిందని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. అయితే, లలిత మృతికి సరైన కారణాలు ఇంకా తెలియదని.. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే అది తెలుస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.