గత రాజకీయాన్ని ఇలాగే కొనసాగిద్దామా అని చంద్రబాబును టార్గెట్  చేసిన  జగన్      

jagan target on chandra baabu

భారతదేశంలో జన్మించిడం ప్రతీ ఒక్కరి అదృష్టం అంటూ కొనియాడారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.  రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందకుండా దళారులు దోచుకున్నారని విమర్శించారు. అధికారం అండదండలతో అవినీతి రాజ్యమేలుతుండటం స్వాతంత్య్రానికి తూట్లు పొడవటమేనని జగన్ అభిప్రాయపడ్డారు. అధికారం, అవినీతి పాలు నీళ్లులా కలిసి ఉంటాయనే భావనను గత ప్రభుత్వాలు కల్పించాయని దాన్ని అలాగే వదిలేద్దామా అంటూ ప్రశ్నించారు. ఎలాంటి విలువలు లేని, విశ్వసనీయత లేని గత రాజకీయాన్ని ఇలాగే కొనసాగిద్దామా అన్న ఆలోచనపై ప్రతీ ఒక్కరూ చర్చించుకోవాలన్నారు.స్వాతంత్ర్యం కోసం కృషి చేసిన మహానుభావులకు వందనాలు తెలిపారు సీఎం జగన్.  వందేమాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్, వందేమాతరం, క్విట్ ఇండియా అంటూ స్వాతంత్య్ర సమరయోధులు ఇచ్చిన నినాదాలు ప్రజలను స్వాతంత్య్రోద్యమం వైపు ఉత్తేజపరిచాయన్నారు. గ్రామస్వరాజ్యం అన్న మహాత్మగాంధీ స్వప్నం నెరవేరాలంటే బడుగులు, బలహీన వర్గాలు, దళితులు అభివృద్ధిచెందడమే లక్ష్యమన్నారు. మహాత్మగాంధీజీ, డా.బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాలను తనను ప్రభావితం చేశాయని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అందులో నుంచి పుట్టుకొచ్చినవే నవరత్నాలు అంటూ జగన్ స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ, ఆర్థిక అసమానతలు నేడు కూడా ఉండటం దురదృష్టకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 శాతం మంది నిరక్ష్యరాస్యులుగా ఉండటం దురదృష్టకరమన్నారు. బ్రిక్స్ దేశాలలోని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలోనే నిరక్ష్యరాస్యత శాతం ఎక్కువగా ఉందన్నారు.

శిశుమరణాల రేటు కూడా ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కువగా ఉండటం బాధిస్తున్నాయన్నారు. చదువుకోవాలని ఉన్నా ఆర్థిక సమస్యల వల్ల చదువుకోలేని పరిస్థితి నెలకొంది. కులాల పరంగా, మతాల పరంగా నేటికి నిరంతరం అన్యాయం జరుగుతున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ పరిణామాలు స్వాతంత్య్రోద్యమానికి మారని మచ్చగా మారిపోయాయన్నారు సీఎం జగన్. బ్రిటీష్ పాలనను పరాయి పాలనగా, దోపిడీ పాలనగా సమానత్వంలేని పాలనగా హక్కులు లేని పాలనగా భావించామని జగన్ తెలిపారు. పరాయిపాలన 1947ఆగష్టు 15న పోయినప్పటికీ దాని అవలక్షణాలు మాత్రం 72 సంవత్సరాల తర్వాత కూడా వాటిని వదిలించుకోలేని పరిస్థితి దేశంలోనూ రాష్ట్రంలోనూ కనిపిస్తోందని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. 1947లో స్వాతంత్య్రం అందరికీ వచ్చిందా లేక కొంతమందికి వచ్చిందా అన్న అంశంపై ప్రతీ ఒక్కరూ బాధ్యతగా సమాధానం వెతకాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మానవ అభివృద్ధి సూచికలో రాష్ట్రం ఏ స్థానంలో ఉందో చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి, పరిశ్రమలు, ఇండస్ట్రీస్  అభివృద్ధిలో ఎక్కడ ఉన్నామో కూడా తెలుసుకోవాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *