100 DEVELOPERS IN UDS SALES
# జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ అనుమతి లేదు
# రెరా అథారిటీ అనుమతి లేదు
# వందకు పైగా డెవలపర్ల అక్రమ వసూళ్లు
# ఆరంభం కానివి ఇరవై శాతం ప్రాజెక్టులు
# యూడీఎస్ లో అక్రమంగా 25 వేల కోట్ల వసూలు?
# ఈ జాడ్యం చిన్న టౌన్లకూ విస్తరణ..
# బయ్యర్లు తస్మాత్ జాగ్రత్త..
ఒకటి కాదు.. రెండు కాదు.. హైదరాబాద్లో దాదాపు వందకు పైగా డెవలపర్లు అక్రమ విధానంలో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. వంద శాతం సొమ్ము చెల్లిస్తే అతి తక్కువకే ఫ్లాటను అందజేస్తామని మోసపూరితంగా సొమ్ము వసూలు చేస్తున్నారు. ఇలా సుమారు రూ.25 వేల కోట్ల దాకా యూడీఎస్ విధానంలో కొనుగోలుదారుల్నుంచి వసూలు చేసినట్లు సమాచారం. రేటు తక్కువని ఆశ చూపెట్టి డబ్బులు వసూలు చేసిన ప్రాజెక్టుల్లో సుమారు ఇరవై శాతం నేటికీ ఆరంభం కాలేదని సమాచారం. విస్తుగొలిపే విషయం ఏమిటంటే.. బయ్యర్లు పూర్తిగా నగదును తీసుకొచ్చి ఈ డెవలపర్ల చేతిలో పోస్తున్నారు. సొమ్ము కట్టిన తర్వాత కొనుగోలుదారులకు నిర్మాణ సంస్థలు సరైన రశీదు కూడా అందించడం లేదు. ఏదైనా పొరపాటు జరిగి ఆ నిర్మాణం ప్రారంభం కాకపోతే, బయటికొచ్చి ఎవరికీ ఫిర్యాదు చేయలేని దుస్థితి వీరిది. దీంతో, కొందరు కొనుగోలుదారులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని తెలిసింది. యూడీఎస్ లో ఫ్లాట్లు కొని మోసపోయామని కొనుగోలుదారులు బహిరంగంగా ఫిర్యాదు చేసే రోజులు త్వరలో రానున్నాయని నిర్మాణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
# హైదరాబాద్ నిర్మాణ రంగాన్ని కరోనా కంటే అతి వేగంగా కాటేస్తుంది.. యూడీఎస్ స్కీమ్. కరోనా తర్వాత మార్కెట్ కోలుకుంటునే సమయంలో.. కొన్ని నిర్మాణ సంస్థలు ఈ అక్రమ విధానంలో ఫ్లాట్లను విక్రయించడం వల్ల అసలైన అమ్మకాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ నిర్మాణరంగ నిపుణుల ప్రకారం.. యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను విక్రయించే ప్రక్రియ తెలంగాణలోని చిన్న చిన్న టౌన్లకు విస్తరించింది. దీని వల్ల సామాన్య కొనుగోలుదారులు ఈ మాయలో పడిపోయి తమ కష్టార్జితాన్ని పోగొట్టుకునే ప్రమాదముంది. కాబట్టి, కొనుగోలుదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. పొరపాటున ఏదైనా సమస్య వస్తే.. ప్రభుత్వం నుంచి సహాయం అందే అవకాశమే లేదు.
అమ్మేదెవరు? త్వరలో..
హైదరాబాద్లో ఎలాగైనా సొంతిల్లు కొనుక్కోవాలని భావించేవారిలో అధిక శాతం మంది రేటు తక్కువ అనే అంశాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఊర్లో పొలం ఉంటే దాన్ని కొంత అమ్ముకుని నగరానికొచ్చి యూడీఎస్ విధానంలో ఫ్లాట్లను కొంటున్నారు. ఇక్కడ వీరు గమనించేది.. కేవలం రేటు మాత్రమే. ఆయా స్థలంలో న్యాయపరమైన చిక్కులున్నాయి? పక్కనే చెరువులున్నాయి? బఫర్ జోన్ లో ఉందా? ఇంకా ఏమైనా సమస్యలున్నాయా అనే అంశాల్ని విస్మరిస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్లో ఒక బిల్డర్ కొనుగోలుదారుల్నుంచి యూడీఎస్ లో ఫ్లాట్లు విక్రయించాక.. ఆయా భూమికి సంబంధించి న్యాయపరమైన చిక్కులు ఏర్పడటంతో ప్రాజెక్టు ఆలస్యమైంది. దీంతో, అందులో కొన్నవారంతా గగ్గోలు పెట్టారని తెలిసింది. ఇలా, యూడీఎస్ ప్రాజెక్టుల్లో దాదపు ఇరవై శాతానికి పైగా ఇలాంటి సంఘటనలే ఎదురవుతున్నాయని పలువురు రియల్టర్లు అంటున్నారు. మరి, ఏయే సంస్థలు ఇలా అక్రమ బాట పట్టాయో త్వరలోనే తెలుసుకుందాం.
Hyderabad UDS Scam