ఇక ఉద్యోగాల జాతర

2.5 LAKH VACANCIES TO BE FILLED

  • 5 లక్షల పోస్టుల భర్తీకి కేంద్రం యోచన
  • ఐటీలో 35వేలు, సెంట్రల్ ఎక్సైజ్ లో 39వేల పోస్టుల సృష్టి
  • పారామిలటరీ బలగాల్లో లక్ష మంది నియామకం

సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ప్రజలను ఆకట్టుకునే దిశగా కేంద్రంలోని బీజేపీ ముందుకెళుతోంది. మరోసారి అధికారం దక్కించుకునేందుకు వీలుగా వడవడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఆర్థికంగా వెనకబడిన వర్గాలవారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన కేంద్రం.. తాజాగా ఒకేసారి ఏకంగా రెండున్నర లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని యోచిస్తోంది. ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యోగాల భర్తీ జరగలేదు. దేశంలో నిరుద్యోగం ఎక్కువైపోయింది. గత నాలుగేళ్లలో కేంద్ర ఉద్యోగుల సంఖ్య 2.26 శాతం మేర తగ్గిపోయింది. ఈ అంశం వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, కొత్తగా సృష్టించబోయే 2.5 లక్షల పోస్టుల్లో దాదాపు 40 శాతం ఒక్క పారా మిలిటరీ బలగాల్లోనే ఉంటాయి. ప్రస్తుతం పారామిలటరీలో 10.24 లక్షల మంది ఉండగా, వారిని 11.25 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. అలాగే ఆదాయపు పన్ను శాఖలో 35 వేల మందిని, కస్టమ్స్‌-సెంట్రల్‌ ఎక్సైజ్‌ విభాగంలో 39వేల మందిని తీసుకోనున్నారు. ఇక వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, సమాచార-ప్రసార మంత్రిత్వ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ వంటి శాఖల్లో దాదాపు 75వేల మందిని భర్తీ చేయనున్నారు. దీంతో మొత్తం దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ కానున్నాయి.

వాస్తవానికి ఇటీవల కాలంలో కేంద్ర ఉద్యోగుల సంఖ్య అంతకంతకూ తగ్గుతూ వస్తోంది. రక్షణ బలగాలను మినహాయించగా.. 2014లో 33.3 లక్షల మంది ఉన్న కేంద్ర ఉద్యోగులు.. గతేడాదికి 32.52 లక్షల మందికి తగ్గిపోయారు. ఉద్యోగ విరమణ చేసినవారి స్థానంలో కొత్తవారిని శాశ్వత ప్రాతిపదికగా నియమించకుండా కాంట్రాక్ట్ బేస్డ్, థర్డ్ పార్టీ తరహాలో ఉద్యోగులను తీసుకుంటుండమే ఈ తగ్గుదలకు కారణం. రైల్వేలో 2010లో ఎంత మంది ఉద్యోగులున్నారో 2018లోనూ అంతే ఉండటం గమనార్హం. యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డుల ద్వారా జరిగిన మొత్తం నియామకాలు 2015-16లో 1,13,524 ఉంటే, 2017-18లో 1,00,933గా ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఉద్యోగాల జాతరకు నడుం బిగించింది. త్వరలోనే వీటికి సంబంధించిన ప్రకటనలు వెలువడనున్నాయి.

NATIONAL UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *