టెన్షన్లో ఆ ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు

Spread the love

3 TDP MLA’S WERE IN TENSION

అసలే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస సమస్యలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కుదేలైన తెలుగుదేశం పార్టీని అనర్హత వేటు అంటూ వైసీపీ కోర్టులను ఆశ్రయించడం ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. తెలుగుదేశం పార్టీలో కీలక నేతలైన ముగ్గురు సభ్యులపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనర్హత పిటీషన్ లు దాఖలు చేశారు. పెద్దాపురం ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ వైసీపీ అభ్యర్థి తోట వాణి హైకోర్టును ఆశ్రయించారు. ఓబులాపురం మైనింగ్ కార్యాలయంపై దాడి కేసులో మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప, అచ్చెన్నాయుడులు అడ్డంగా బుక్కైతే, రెండో భార్య నలుగురు సంతానం అంశాన్ని దాచిపెట్టినందుకు కరణం బలరాం బుక్కయ్యారు. త్వరలోనే ఈ అనర్హత పిటీషన్ లు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ అనర్హత వేటు పడితే తెలుగుదేశం పార్టీ కీలక నేతలను కోల్పోతుంది.

చినరాజప్ప గెలుపై శనివారం హైకోర్టును ఆశ్రయించారు వైసీపీ ఇంచార్జ్ తోట వాణి. ఎన్నికల అఫిడవిట్‌లో క్రిమినల్ కేసులు, ఆదాయ వనరులు దాచిపెట్టి తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినట్టు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చినరాజప్పపై అనర్హత వేటు వేయాలంటూ పిటీషన్ లో పేర్కొన్నారు తోట వాణి. అలాగే 2007లో ఓబులాపురం మైనింగ్ కార్యాలయంపై దాడి చేసిన కేసులో చినరాజప్ప 15వ ముద్దాయి అని వైసీపీ అభ్యర్థి తోట వాణి స్పష్టం చేశారు. దాడి కేసును మూసివేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని 2016, 2018లలో రెండు జీవోలు విడుదల చేసి కోర్టుకు పంపిచినట్లు తెలిపారు. అయితే సాంకేతిక కారణాల వల్ల కోర్టు కేసు కొట్టివేతను తిరస్కరించిందని తెలిపారు. ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే ఈ కేసుల అంశాన్ని అఫిడవిట్ లో చినరాజప్ప ప్రకటించలేదని వాణి ఆరోపించారు. ఎమ్మెల్సీ పెన్షన్, ఆపద్ధర్మ డిప్యూటీ సీయంగా పొందుతున్న జీత భత్యాలను దాచిపెట్టి తనకు కేవలం వ్యవసాయం ద్వారా మాత్రమే ఆదాయం వస్తుందని చినరాజప్ప పొందుపరచడం రాజ్యాంగ విరుద్ధమంటూ ఆమె తన పిటీషన్ లో ఆరోపించారు. రాబోయే ఆరు నెలల్లో హైకోర్టు చినరాజప్పపై అనర్హత వేటు వేస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఆ తర్వాత తానే పెద్దాపురం ఎమ్మెల్యే అవుతానని తోట వాణి ధీమా వ్యక్తం చేశారు. అయితే తోట వాణి పిటీషన్ పై ఇప్పటి వరకు మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం.

మరోవైపు తెలుగుదేశం పార్టీలో కీలక నేత అచ్చెన్నాయుడును కూడా అనర్హత వేటు పిటీషన్ వెంటాడుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హోదాలో ఉన్న అచ్చెన్నాయుడు టీడీపీకి గుండెకాయలా మారారు. తక్కువ సంఖ్యాబలం ఉన్నప్పటికీ అసెంబ్లీలో ప్రతిదాడికి దిగుతున్నారు. ఒకవైపు అధికార పార్టీకి సూచనలు ఇస్తున్నా అంటూనే పంచ్ డైలాగులతో విరుచుకుపడుతున్నారు. అలాంటి నేతపై అనర్హత వేటు పిటీషన్ దాఖలు చేయడం ఆపార్టీకి మింగుడుపడటం లేదు. 2007 జూలై నెలలో ఓబులాపురం మైనింగ్ కార్యాలయంపై దాడి చేసిన కేసులో అచ్చెన్నాయుడు 21వ ముద్దాయి అని వైసీపీ అభ్యర్థి పేరాడ తిలక్ ఆరోపించారు. అరెస్ట్ వారెంట్ కేసు ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ అఫిడవిట్ లో పొందుపరచకుండా దాచిపెట్టడం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. అచ్చెన్నాయుడు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే చీరాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత కరణం బలరామకృష్ణమూర్తిపై కూడా అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించారు. కరణం బలరామకృష్ణమూర్తికి ఇద్దరు భార్యలు అని ఆయనకు అంబికా కృష్ణ అనే కుమార్తె ఉన్నప్పటికీ అఫిడవిట్ లో పొందుపరచలేదని ఆరోపిస్తూ హైకోర్టులో అనర్హత పిటీషన్ దాఖలు చేశారు.
కరణం బలరామకృష్ణమూర్తి ఎన్నికల్లో తప్పుడు ఆఫిడవిట్‌ సమర్పించారని ఆరోపించారు. బలరాం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. బలరాంకు నలుగురు పిల్లలైతే ఆఫిడవిట్‌లో ముగ్గురని పేర్కొన్నారని విమర్శించారు. దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కరణం బలరాంకు రెండో భార్య మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అని ఆయన ఆరోపించారు. 1985లో కాట్రగట్ట ప్రసూనను శ్రీశైలంలో ప్రముఖుల సమక్షంలో కరణం బలరాం వివాహం చేసుకున్నారని వారి దాంపత్యానికి 1989లో అంబిక కృష్ణ జన్మించిందని ఆరోపించారు. అంబిక కృష్ణ తండ్రిగా కరణం బలరామకృష్ణమూర్తి పేరు నమోదైందని అందుకు సంబంధించి అంబిక కృష్ణ ఎస్ఎస్సీ సర్టిఫికెట్, ఆధార్ సర్టిఫికెట్ లను జతపరుస్తూ కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించి 7వేల పేజీలతో ఆధారాలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు. అంబిక కృష్ణకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తాను అనర్హత పిటీషన్ దాఖలు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. దీంతో ఇప్పుడు ఆ ముగ్గురు కీలక టీడీపీ ఎమ్మెల్యేలకు పదవీగండం పొంచి వుంది.

TELUGU DESAM PARTY 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *