బావిలో 9 మృతదేహాలు ఎవరివి?

9 Migrants Mysterious Death

వరంగల్‌ నగర శివారులోని గొర్రెకుంట ప్రాంతంలో ఉన్న ఒక గన్నీ సంచుల గోదాం వద్ద పాడుబడ్డ బావిలో అనుమానాస్పద స్థితిలో ఇప్పటి వరకు 9 మృతదేహాలు బయటపడ్డాయి. నిన్న నాలుగు మృతదేహాలు, ఇవాళ మరో 5 మృతదేహాలు గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు బావిలో ఉండటంతో హత్యలా? సామూహిక ఆత్మహత్యాలా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతులు ఎండీ మక్సూద్‌(50), ఆయన భార్య నిషా(45), కుమార్తె బుస్ర (20), మూడేళ్ల మనవడిగా గుర్తించారు. ఇవాళ లభ్యమైన 5 మృతదేహాల్లో మక్సూద్‌ కుమారుడు షాబాద్‌(22), బిహార్‌కు చెందిన కార్మికుడు శ్రీరామ్‌గా గుర్తించారు. మరొ మృత దేహం వివరాలు తెలియాల్సి ఉంది.

మృత దేహాలను పోస్టు మార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.మంత్రి ఎర్రబెల్లి దయాకర్, సంఘటనా స్థలిని వరంగల్‌ సీపీ రవీందర్‌, మేయర్‌ ప్రకాశ రావు, కలెక్టర్ హరిత పరిశీలించారు.  ఎండీ మక్సూద్‌ 20 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం నుంచి బతుకుదెరువు కోసం వరంగల్‌కు కుటుంబంతో సహా వలస వచ్చాడు. తొలుత కరీమాబాద్‌ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉండేవారు. డిసెంబరు నుంచి గీసుకొండ మండలం గొర్రెకుంట ప్రాంతంలోని ఓ గన్నీ సంచుల తయారీ గోదాంలో పని చేస్తున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా వరంగల్‌ నుంచి రాకపోకలకు ఇబ్బందిగా ఉండటంతో.. నెలన్నర నుంచి గోదాంలోనే ఉన్న రెండు గదుల్లో మక్సూద్‌తోపాటు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు ఉంటున్నారు. భర్తతో విడిపోయిన కుమార్తె బుస్ర కూడా తన మూడేళ్ల కుమారుడితో కలిసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.

వీరితో పాటు కుటుంబంతోపాటు బిహార్‌కు చెందిన యువకులు శ్రీరాం, శ్యాం కూడా అదే ఆవరణలోని మరో గదిలో నివసిస్తూ గోదాంలో పనిచేస్తున్నారు. పరిశ్రమ యజమాని సంతోష్‌ రోజూలాగే గురువారం మధ్యాహ్నం గోదాంకు వచ్చే సరికి కార్మికులెవరూ కనిపించలేదు. పరిసరాల్లో అన్వేషించినా జాడ లేకపోవడంతో.. పక్కనే ఉన్న పాడుబడ్డ బావిలో చూడగా నాలుగు మృతదేహాలు నీళ్లలో తేలుతూ కనిపించాయి. గీసుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ సిబ్బంది వచ్చి ఆధారాలు సేకరించారు. వరంగల్‌ నగరపాలక సంస్థ సిబ్బంది.. విపత్తు నిర్వహణ బృంద సభ్యులు, పోలీసులు కలిసి మృతదేహాలను తాళ్లతో వెలికి తీశారు. నేడు ఉదయం మరో 5 మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Telangana Crime Updates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *