స్వామి అగ్నివేశ్‌  మన తెలుగువారే

7
agnivesh
agnivesh

Swami Agniwesh

సంఘ సేవకుడు స్వామి అగ్నివేశ్‌(80) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా లివర్‌ సిర్రోసిస్‌ వ్యాధితో ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. చాలామందికి ఆయన తెలుగువారే అనే విషయం తెలియదు. ఆయన అసలు పేరు వేప శ్యామ్‌ రావు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని మారుమూల గ్రామంలో పుట్టారు. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో ఛత్తీస్‌గఢ్‌లో తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలో సెయింట్‌ గ్జేవియర్‌ కాలేజీ నుంచి డిగ్రీ చేశారు.

సామాజిక కార్యకర్తగా, ఆధ్యాత్మిక వేత్తగా పేరొందారు. బాలల వెట్టిచాకిరీ నిర్మూలన కోసం బంధ ముక్తి మోర్చా పేరుతో సంస్థను స్థాపించారు. ఆర్యసమాజ్‌ సిద్ధాంతాలకు ఆకర్షితులైన అగ్నివేశ్‌ 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. 1977లో హరియాణా అసెంబ్లీకి ఎన్నికై విద్యా శాఖ మంత్రిగా సేవలు అందించారు. వెట్టిచాకిరీని నిరసిస్తున్న వారిపై పోలీసులు కాల్పులు జరపడం, ఆనాటి హరియాణా ప్రభుత్వం దానిపై నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతో అగ్నివేశ్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన ఆర్యసమాజ్‌ ప్రపంచ మండలికి 2014 వరకు అధ్యక్షుడిగా వ్యవహరించారు. బాల్యమంతా ఛత్తీస్‌గఢ్‌లోనే గడిపినా అప్పుడప్పుడూ శ్రీకాకుళం వస్తుండేవారు. ఆయన మరణం పట్ల వివిధ పార్టీల రాజకీయ నాయకులు, మేధావులు, పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

స్వామి దయానంద సరస్వతి నుంచి గాంధీజీ, కార్ల్‌మార్క్స్‌ దాకా ఎందరో మహానుభావుల ప్రభావం తనపై ఉందని ఆయన చెప్పేవారు. రాజకీయ నాయకుడిగా హరియాణా హక్కుల కోసం ముందుండి పోరాడిన ఆయన.. పలుమార్లు జైలుకు వెళ్లారు. స్వామి ఇంద్రవేశ్‌తో కలిసి హరియాణాలో రైతులకు కనీస మద్దతు ధర, సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం పోరాడా రు.