ఏపీ డీజీపీ వెనక్కి వెళ్లిపోతున్నారా?

Spread the love

AP DGP RETURN TO CENTER?

  • కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్లిపోనున్న ఠాకూర్
  • ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని సమాచారం

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి ఆయన కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయనపై పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ పలుమార్లు ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును డీజీపీ పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ కేసులో సరైన విచారణ జరపకుండానే సీఎం వ్యాఖ్యలకు మద్దతుగా డీజీపీ మాట్లాడారని విమర్శించారు. జగన్ పై హత్యాయత్నం చేసిన వ్యక్తి వైసీపీకి చెందినవాడే అని చెప్పారని మండిపడ్డారు. తర్వాత పలు అంశాల్లో కూడా ఆయన వైసీపీ నేతల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో డీజీపీగా ఠాకూర్ ఉంటే పోలింగ్ నిష్పక్షపాతంగా జరగదని, అందువల్ల ఆయన్ను మార్చాలంటూ వైఎస్సార్ సీపీ పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. వైసీపీ ఫిర్యాదులపై సానుకూలంగానే స్పందించిన ఈసీ.. ఠాకూర్ విషయంలో మాత్రం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. వైసీపీ నేతలు కోరినట్టు ఆయనకు ఎన్నికల విధుల నుంచి తప్పించలేదు. ఫలితంగా ఎన్నికల వేళ డీజీపీగా ఠాకూరే ఉన్నారు. అయితే, పోలింగ్ అనంతరం ఠాకూర్ మనసు మారినట్టుగా చెబుతున్నారు. ఏపీని వీడి తిరిగి కేంద్రానికి వెళ్లిపోవాలని భావిస్తున్నారని, ఇందుకోసం కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. పోలింగ్ సరళి చూసిన తర్వాత, తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు లేవనే నిర్ణయానికి రావడంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. చంద్రబాబు ఓడిపోయి, జగన్ అధికారంలోకి వస్తే తనకు ఇబ్బందులు తప్పవని భావించడం వల్లే ఠాకూర్ తిరిగి వెనక్కి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *