సీనియర్ ఐఏయస్ నీలం సాహ్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. సీఎస్ గా పని చేస్తున్న ఎల్వీ సుబ్రమణ్యం పైన ఆకస్మికంగా బదిలీ వేటు వేసిన ప్రభుత్వం ఏపీ కేడర్ కు చెందిన నీలం సాహ్నికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించింది. కేంద్ర సర్వీసుల్లో ఉన్న నీలం సాహ్నిని ఏపీ ప్రభుత్వం ఇక్కడకు రప్పించి బాధ్యతలు అప్పగించింది. తాత్కాలిక సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ నుండి నీలం బాధ్యతలు స్వీకరించారు. ఐఏయస్ గా తన మొదటి పోస్టింగ్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోనే అని గుర్తు చేసుకున్నారు నీలం సాహ్ని. మళ్లీ తిరిగి ఎపి కి వచ్చి పని చేయడం చాలా ఆనందంగా ఉందని నీలం చెప్పుకొచ్చారు.
ఈ రాష్ట్రం నాకు చాలా నేర్పింది. నా ప్రయాణం ఇక్కడికి నుండే మొదలై మళ్లీ ఇక్కడికే వచ్చానంటూ కొత్త సీఎస్ నీలం సాహ్ని వ్యాఖ్యానించారు. అసిస్టెంట్ కలెక్టర్ గా మొదలై సీఎస్ గా.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని 1984వ ఐఏఎస్ బ్యాచ్ అధికారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో అసిస్టెంట్ కలక్టర్ గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. టెక్కలి సబ్ కలక్టర్ గా.. నల్గొండ జిల్లా సంయుక్త కలక్టర్ గా పని చేశారు. అదే విధంగా మున్సిపల్ పరిపాలన శాఖ డిప్యూటీ సెక్రటరీగా, హైదరాబాదులో స్త్రీ శిశు సంక్షేమశాఖ పిడిగాను పనిచేశారు. ఆ తరువాత నిజామాబాదు జిల్లా పిడిడిఆర్డిఏ గాను.. ఖమ్మం జిల్లాల్లో కాడా అడ్మినిస్ట్రేటర్ గాను పని చేశారు. తరువాత ఇంధనశాఖలో సంయుక్త కార్యదర్శిగా.. నల్గొండ జిల్లా కలక్టర్ గా.., కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్ గా.. రోడ్లు, రహదారులు, భవనాల శాఖ కార్యదర్శిగా పని చేశారు. క్రీడల శాఖ కమీషనర్ మరియు శాప్ విసి అండ్ ఎండిగాను పని చేశారు.
కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లే ముందు.. ఉమ్మడి ఏపీలో వివిధ హోదాల్లో పని చేసిన నీలం.. చంద్రబాబు హాయంలోనూ ఇక్కడే పని చేశారు. అనంతరం కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శిగా కేంద్రంలో పని చేసిన అనంతరం ఎపిఐడిసి కార్పొరేషన్ విసి అండ్ ఎండిగా ఉమ్మడి రాష్ట్రంలో పని చేశారు. అనంతరం స్త్రీశిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. 2018 నుండి కేంద్ర సామాజిక న్యాయం మరియు ఎంవపర్మెంట్ కార్యదర్శిగా పనిచేస్తూ నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు..గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సతీనాయర్, మిన్నీ మాధ్యూలు మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేయగా నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి మహిళా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరించారు.
tags : andhrapradesh, neelamsahni, chief secretary, lv subramanyam, transfer, first woman CS