సుగాలి ప్రీతి కేసు సీబీఐకి… ఏపీ సర్కార్

AP Govt Orders Issue Over CBI Enquiry On Sugali Preethi

2017లో ఏపీలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతీ కేసును ఏపీ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది. ఈ మేరకు జగన్ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల కంటి వెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కర్నూల్‌కు వెళ్లిన సీఎం జగన్‌ను ప్రీతి  తల్లిదండ్రులు కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రీతి కేసును సీబీఐకు రిఫర్ చేస్తామని.. జగన్ వారికి భరోసా ఇచ్చారు. అంతేకాదు ఈ విషయంపై మరోసారి కూలంకషంగా మాట్లాడేందుకు, తన వద్దకు రావాలని కూడా సూచించారు. ఈ క్రమంలో తాజాగా ఈ కేసును సీబీఐకు అప్పగించారు.

అయితే ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతోన్న పార్వతి, రాజు నాయక్ కుమార్తె సుగాలి ప్రీతి  2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్‌ యాజమాన్యం చెప్పింది. అయితే తన కుమార్తెను అత్యాచారం చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇక పోస్ట్‌మార్టంలోనూ ప్రీతిపై అత్యాచారం జరిగినట్లు తేలింది. దీంతో కుటుంబసభ్యులు స్కూల్ యజమానితో పాటు అతడి కుమారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై విచారణకు నియమించిన కమిటీ కూడా ప్రీతిని హత్యాచారం చేశారని నివేదిక ఇచ్చింది. సాక్ష్యాలు బలంగా ఉండటంతో అప్పట్లో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కానీ 23 రోజులకే వారికి బెయిల్ వచ్చింది. అప్పటి నుంచి తమ బిడ్డకు న్యాయం చేయాలంటూ సుగాలి ప్రీతి కుటుంబసభ్యులు పోరాటం చేస్తూనే ఉన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలంటూ కర్నూల్‌లో రెండు రోజులు ర్యాలీ నిర్వహించారు. ప్రీతి కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని ఆ సమయంలో జగన్ ప్రభుత్వానికి కూడా ఆయన సూచించారు. ఇక ఈ నేపధ్యంలోనే సుగాలి ప్రీతీ కేసును సీబీఐ కి అప్పగించారు జగన్ .

AP Govt Orders Issue Over CBI Enquiry On Sugali Preethi,sugaali preethi, cbi probe, ap government , ycp , ys jagan mohan reddy , kurnool, pawan kalyan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *