ఆయుష్ లో కొనసాగుతున్న  జియో ట్యాగింగ్ రగడ

AYUSH HOSPITAL GEO TAGGING ISSUE

ఆయుష్ లో జియో ట్యాగింగ్ రగడ కొనసాగుతుంది. ఆయుష్ విభాగపు వైద్య సిబ్బందికి జియో ట్యాగింగ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ నిర్ణయించారు. ప్రతి ఒక్కరు మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించిన కమిషనర్ ఆసుపత్రికి వెడితే హాజరు పడేలా దీనిని రూపకల్పన చేశారు. ఇక ఉద్యోగులకు జియో ట్యాగింగ్ దేశంలోనే ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో ఆయుష్ సిబ్బంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాహనాలకు, జంతువులకు వాడే జియో ట్యాగింగ్ ను అమలు చేయాలనే ఆలోచన తప్పని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్య సిబ్బంది పనితీరు మెరుగుపరచడానికి, వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఆయుష్ సిబ్బంది విధులకు డుమ్మా కొట్టకుండా హాజరు కావడానికి జియో ట్యాగింగ్ ను సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి తీసుకురానున్నట్లు గా వైద్య ఆరోగ్య శాఖ ఆయుష్ విభాగం కమిషనర్ వర్షిని పేర్కొన్నారు. చాలామంది వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులకు హాజరుకాకుండా, బయట క్లినిక్ లు నడిపిస్తున్న క్రమంలో దీనికి చెక్ పెట్టడం కోసం తప్పనిసరిగా జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు.  ఇక ప్రభుత్వ ఆసుపత్రుల పనిచేసే వైద్య సిబ్బంది తమ స్మార్ట్‌ఫోన్‌లో జియో ట్యాగ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటేనే సెప్టెంబరు 1 నుంచి హాజరు పడుతుందని అధికారులు తెలిపారు. ఆయుష్‌ విభాగంలోని స్వీపర్‌ నుంచి డాక్టర్‌ వరకు ఉన్న మొత్తం 2,500 మంది సిబ్బంది జియో ట్యాగింగ్‌ చేసుకోవాల్సిందేనని అధికారులు.

సెప్టెంబరు ఒకటి నుండి జియో ట్యాగింగ్ తో హాజరు తీసుకునే విధానానికిఅవగాహన కార్యక్రమాలను కూడా నిర్వహించారు. జియో ట్యాగింగ్‌కు షెడ్యూల్‌ను కూడా విడుదల చేశా రు. యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసేందుకు ప్రత్యేక సాంకేతిక నిపుణుల బృందాలను ప్రతి జిల్లాకు పంపిన ఉన్నతాధికారులు ఆగస్టు 21న కరీంనగర్‌, 22న మెదక్‌, 23న పాలమూరు, 26న వరంగల్‌, 27న ఖమ్మం, 28న నల్లగొండ, 29న నిజామాబాద్‌, 30న ఆదిలాబాద్‌, 31న హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో యాప్ డౌన్లోడ్ చేయడం తో పాటు, వైద్య సిబ్బందికి జియో ట్యాగింగ్ పై అవగాహన కూడా కల్పించనున్నారు. ఇప్పటికే నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, కరీంనగర్‌ జిల్లాల్లో పూర్తి చేశారు. గురువారం మెదక్‌ జిల్లాలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేస్తుండగా ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకించారు. తమకు జియో ట్యాగింగ్ అవసరం లేదని, దేశంలో ఎక్కడా లేని విధానం ఇక్కడ ఎందుకంటూ ఆందోళన చేశారు.

కొంతమంది ఉన్నతాధికారులు దేశంలోనే ఎక్కడలేని విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టి వైద్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సర్కారును తప్పుదోవ పట్టిస్తున్నారని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం విమర్శించింది. అటు ఆయుష్ వైద్య సిబ్బంది తో పాటు , భాగాల్లో పనిచేసే వైద్యులు సైతం జియో ట్యాగింగ్‌ ను వ్యతిరేకిస్తున్నారు. జియో ట్యాగింగ్ అనేది జంతువులకు, వాహనాలకు వాడతారని, లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారికే దీన్ని వాడతారని, ఎక్కడా లేని విధంగా వైద్యులకు జియో ట్యాగింగ్‌ ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత మొబైల్స్ కు జియో ట్యాగింగ్ చేయడానికి వైద్యులు నిరాకరిస్తున్నారు. ప్రభుత్వం మొబైల్స్ ఇచ్చి వాటికి జియో ట్యాగింగ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఇక అంతకంటే ముందు ఆస్పత్రిలో కావలసిన కనీస వసతులు కల్పించాలని కోరుతున్నారు. మొత్తం మీద వైద్య సిబ్బందికి జియో ట్యాగింగ్ అంశం వైద్య ఆరోగ్య శాఖ ను కుదిపేస్తోంది. ప్రస్తుతం ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకో కపోతే ముందు ముందు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వైద్య సిబ్బంది హెచ్చరిస్తున్నారు.

TRENDING POLITICAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *