బిగ్ బాస్ ప‌బ్లిసిటీ కోస‌మేనా ఇదంతా…?

Spread the love

BAN BIGBOSS 3

అస‌లెందుకు ఇంత చ‌ర్చ‌..? బిగ్ బాస్ 3 షో గురించి ఎందుకిన్ని వివాదాలు..? ఏం, ఆ షో చూడ‌క‌పోతే స్కూళ్ల‌కి వెళ్ల‌మ‌ని పిల్ల‌లు మారాం చేస్తున్నారా, ఉద్యోగాలు చేయ‌లేమ‌ని కుర్రాళ్లు గ‌గ్గోలు పెడుతున్నారా, మాకు ఇదే దిక్క‌ని మ‌హిళ‌లు వాపోతున్నారా, స్టాక్ మార్కెట్ ప‌డిపోతుందా..? లేదు క‌దా! ఒక మామూలు రియాలిటీ షో. కొంత‌మంది ఒక ఇంట్లో ప‌డి వాదులాడుకుంటే, వారానికో పంచాయితీ పెట్టి వాళ్ల‌ని ఇంటికి త‌గిలేయ‌డం… ఇదేగా కాన్సెప్ట్‌! ప‌క్కింటి జ‌ట్టీల మీద ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం అనే మాన‌వ నైజం. ఈ వీక్ పాయింటే బిగ్ బాస్ స‌క్సెస్ కి కార‌ణ‌మైన సైక‌లాజిక‌ల్ ఫాక్ట‌ర్‌. ఆ మాత్రం దానికి ఎందుకింత హైప్ క్రియేట్ చేసేలా క‌థ‌నాలు వ‌స్తున్నాయి..?

కాస్టింగ్ కౌచ్ అనేది ఈ మ‌ధ్య వివాదం అవుతోంది. అది ఏ రంగంలో ఉన్నా క‌చ్చితంగా ఖండించాల్సిందే, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిందే. వారి ఆత్మాభిమానం దెబ్బ‌తినేలా వ్య‌వ‌హ‌రించేవారిపై క‌ఠినంగా చ‌ర్య‌లు ఉండాల్సిందే. ఆ కోణంలో ఆలోచిస్తే… ఇప్పుడు చ‌ర్చ‌నీయం అవుతున్న శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తాల ఆరోప‌ణ‌ల‌పై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం దిగొచ్చు క‌దా..? వాళ్లేమో కేసులు పెడుతుంటే, టీవీ ఛానెళ్లు వాళ్ల‌తో చ‌ర్చ‌లు పెడుతున్నాయి. మిమ్మ‌ల్ని ఏమ‌డిగారు, సంతృప్తిప‌ర‌చ‌డం అంటే ఏంటీ, వంద‌రోజుల‌పాటు శృంగారం లేకుండా ఎలా నిగ్ర‌హించుకుంటార‌ని అడిగితే మీరేం చెప్పారూ… అని ప‌చ్చిప‌చ్చి చ‌ర్చ‌లు పెట్టి కొన్ని ఛానెల్స్ వాటి మీదా మైలేజ్ లాగేస్తున్నాయి. ఇంత జ‌రుగుతుంటే… ఆ షో నిర్వ‌హించేందుకు సిద్ధ‌మౌతున్న యాజ‌మాన్యం ఎందుకు మౌనంగా ఉంటోంది..? మా షో లో అలాంటివేవీ లేవు, మేం సుద్ద‌పూస‌లం అని ఎందుకు చెప్పుకోలేక‌పోతున్నారు..? ప‌బ్లిక్ వ్యూవ‌ర్ షిప్ కావాల‌నిగానీ… సామాజిక బాధ్య‌త అక్క‌ర్లేదా..? వారి మౌనం చూస్తుంటే… కానీ కానీ ఇది మాంచి కాంట్ర‌రోవ‌ర్సీ అయ్యేట్టుంది, ఫ్రీ ప‌బ్లిసిటీ వ‌స్తుంది, బ్లాక్ బ‌స్ట‌ర్ ఓపెనింగ్ టీఆర్పీలు వ‌స్తాయి కానీ కానీ అన్న‌ట్టుగా ఉంది!

సీజ‌న్ 2 బిగ్ బాస్‌, అదేనండీ… నేచుర‌ల్ స్టార్ నాని హోస్ట్ చేశాడు క‌దా గ‌తేడాది! ఆ షోకి పెద్ద‌గా రెస్పాన్స్ రాలేదు. ఫ‌స్ట్ సీజ‌న్ కి వ‌చ్చినంత ఊపు రాలేదు. దాంతో, ఇప్పుడు మూడో సీజ‌న్ ను సూప‌ర్ హిట్ చేసుకోవాల‌నేది ఆ షో నిర్వ‌హకుల ముందున్న టాస్క్‌. కాబ‌ట్టి, ఈసారి నాగార్జున‌ని హోస్ట్ గా తీసుకొచ్చారు. మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు ఆయ‌న బాగానే హేండిల్ చేశారు కాబ‌ట్టి, బిగ్ బాస్ ని ఈసారి నాగ్ గ‌ట్టించే అవ‌కాశాలున్నాయి. అయితే, మూడో సీజ‌న్ మీద నిర్వాహ‌కుల‌కీ అనుమానాలున్నాయి. అందుకే, ముందుగా దాన్ని వీలైనంత కాంట్రొవ‌ర్సీ కానిద్దాం అన్న‌ట్టుగా చూస్తున్న‌ట్టున్నారు. స‌రే.. వాళ్ల వాణిజ్య ప్ర‌యోజ‌నాలు వారికి ముఖ్యం అనుకుందాం. జ‌నం చూస్తే చాలు… వాళ్లేమైంతే మ‌న‌కేం అనేదే వారికున్న సోష‌ల్ రెస్పాన్సిబిలిటీ అనుకుందాం. ప్ర‌భుత్వం ఏంచేస్తున్న‌ట్టు..? ఎందుకు దీనిపై ఉపేక్షించ‌డం..? ఆ షో అవ‌స‌ర‌మా అనే కోణంలో ఎందుకు చ‌ర్చ జ‌ర‌గ‌డం లేదు..? స‌రే, షో చేసుకోండి మీ ఇష్టం.. కానీ, ఈ పెంట ప‌నులేంటని ఎందుకు నోరుమెద‌ప‌రు..? ఒక్కసారి క‌ఠిన‌ చ‌ర్య‌లు తీసుకుంటే ఇలాంటివి పున‌రావృతం కావు క‌దా!

Political news

BIGBOSS 3 UPDATES

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *