భళా బంగ్లాదేశ్

BANGLA WON ON SA

  • దక్షిణాఫ్రికాపై సంచలన విజయం
  • 21 పరుగుల తేడాతో సఫారీలపై గెలుపొందిన బంగ్లాదేశ్

చప్పగా సాగుతున్న ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో ఆదివారం సంచలనం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ జట్టు దక్షిణాఫ్రికా జట్టును ఓడించి రికార్డు సృష్టించింది. సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ లో చెలరేగిపోయింది. బంగ్లా ఇన్నింగ్స్ లో ఒక్కరూ సెంచరీ చేయకపోయినా ఏకంగా ఆ జట్టు 330 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్‌(30 బంతుల్లో 42), షకీబుల్‌ హసన్‌(84 బందుల్లో 75), ముష్పికర్‌ రహీమ్‌(80 బంతుల్లో 78), మహ్మదుల్లా(33 బంతుల్లో 46 నాటౌట్‌) సమిష్టిగా రాణించచడంతో బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 330 పరుగుల భారీ స్కోర్ చేసింది. వన్డేల్లో ఆ జట్టుకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టు 60 పరుగుల వద్ద ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌(16) వికెట్ కోల్పోయింది. జట్టు స్కోర్ 75 పరుగుల వద్ద ఉండగా.. సౌమ్య సర్కార్ భారీ షాట్ ఆడబోయి పెవిలియన్ చేరాడు. దీంతో షకీబుల్ హాసన్, ముష్పికర్‌ రహీమ్‌ల జోడి ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకుంది.

వీరిద్దరూ కలిసి మూడు వికెట్ కు 142 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో వీరిద్దరూ అర్థ సెంచరీలు పూర్తిచేసుకున్నారు. 217 పరుగుల వద్ద షకీబుల్‌ మూడో వికెట్‌గా వెనుతిరగగా.. కాసేపటికి మహ్మద్‌ మిథున్‌(21) కూడా ఔట్‌ కావడంతో బంగ్లాదేశ్ జట్టు 242 పరుగులకు నాలుగో వికెట్‌ను కోల్పోయింది. తర్వాత వచ్చిన ఆటగాళ్లు బ్యాట్ ఝలిపించడంతో బంగ్లాదేశ్ భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మోరిస్‌, తాహీర్‌, ఫెహ్లుకోవియా తలో రెండు వికెట్లు తీశారు. అనంతరం 331 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 309 పరుగులకే పరిమితమైంది. దీంతో 21 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(32 బంతుల్లో 23), మార్‌క్రమ్‌(56 బంతుల్లో 45) శుభారంభం ఇచ్చారు. జట్టు స్కోర్‌ 49 పరుగుల వద్ద ఉండగా డికాక్‌ రనౌట్‌ అయ్యాడు. ఆ దశలో వచ్చిన కెప్టెన్‌ డుప్లెసిస్‌ (53 బంతుల్లో 62) ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. స్వల్పవ్యవధిలో డుప్లెసిస్, మార్ క్రమ్ ఔటవ్వగా తర్వాత డేవిడ్‌ మిల్లర్‌(43 బంతుల్లో 38), డుస్సెన్‌(38 బంతుల్లో 41) స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లినప్పటికీ.. క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో దక్షిణాఫ్రికా 309 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికాకు ఇది రెండో పరాజయం కావడం గమనార్హం.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *