లండన్ లో చేనేత బతుకమ్మ ధూం ధాం

Bathukamma DhumDham in London

తెలంగాణ పూల పండుగ విదేశీ గడ్డపై కొత్త సంబురాలు నింపింది. చేనేత బతుకమ్మ తెలుగింటి ఆడపడుచులను మంత్రముగ్ధులను చేసింది. లండన్‌ వేదికగా బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. యూకేలో స్థిరపడ్డ వెయ్యికి పైగా కుటుంబాలు ఈ వేడుకల్లో పాలు పంచుకోవడం విశేషం. ముఖ్య అతిథులుగా భారత హై కమిషన్ ప్రతినిధి రాహుల్, హౌన్సలౌ మేయర్ టోనీ లౌకీ హాజరయ్యారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో అందంగా పేర్చే బతుకమ్మ సమైక్య జీవన విధానానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. పితృ అమావాస్య మొదలు ప్రారంభమయ్యే ఈ పూల పండుగ తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతుంది. అయితే విదేశీ గడ్డపై నివసిస్తున్న తెలంగాణ బిడ్డలు బతుకమ్మ పండుగను ఘనంగా చేసుకోవడం ప్రత్యేకత సంతరించుకుంది. లండన్‌లో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి.

తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆధ్వర్యంలో చేనేత బతుకమ్మ – దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. యూకేలో స్థిరపడ్డ పన్నెండు వందలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఆడపడుచులు ఒక్కచోట చేరి భక్తి శ్రద్ధలతో గౌరీ దేవికి ప్రత్యేక పూజలు జరిపి బతుకమ్మ ఆట పాటలతో, కోలాటాలతో సందడి చేశారు.తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి వాటి మధ్య ఉంచిన కాకతీయ కళాతోరణం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ ప్రత్యేకత చాటి చెప్పేలా ప్రతి యేటా వినూత్నంగా ఇలా ఏదో ఒక చారిత్రక రూపం కొలువుదీర్చడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. అదలావుంటే రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఆ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేలా తమ వంతు బాధ్యత తీసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తూ భారీ ఫ్లెక్సీని ఆవిష్కరించారు.ఈ ఏడాది చేనేత బతుకమ్మను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కుర్మాచలం. తెలంగాణ ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తోందని.. అదే క్రమంలో మంత్రి కేటీఆర్ కూడా నేతన్నలకు అండగా నిలబడుతున్నారని కొనియాడారు. అందుకే ఈసారి చేనేత బతుకమ్మ – దసరా సంబురాల పేరిట వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేతన్నలకు మా మద్దతు తెలపడానికే ఈసారి ఈ అంశం తీసుకున్నామని చెప్పారు. ప్రవాస భారతీయులు వీలైనంత వరకు చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.

tags : telangana, bathukamma , london, dhoom dham

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *