చేతులెత్తేసిన మరో టీడీపీ అభ్యర్థి

Spread the love

BC JANARDHAN NOT CONTESTING

  • పోటీ నుంచి తప్పుకున్న బనగానపల్లి అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి
  • నియోజకవర్గంలో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందని వెల్లడి

ఓటమి ఖాయమనే భయమో, గెలవలేనప్పుడ పోటీ చేయడం ఎందుకనే నిర్ణయమో తెలియదు గానీ, టికెట్ వచ్చిన తర్వాత కూడా పలువురు అభ్యర్థులు చేతులెత్తేయడం తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో టీడీపీ టికెట్ ఇచ్చినప్పటికీ ఆదాల ప్రభాకర రెడ్డి ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలో చేరారు. తర్వాత శ్రీశైలం అసెంబ్లీ టికెట్ ఖరారైన సిట్టింగ్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ఏకంగా రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. తాజాగా కర్నూలు జిల్లా బనగానపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి కూడా అదే బాటలో నడిచారు. టికెట్ ఇచ్చిన తర్వాత తాను టీడీపీ నుంచి పోటీ చేయనంటూ తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఐదేళ్లలో టీడీపీపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. తాను పోటీచేసినప్పటికీ గెలువలేనని.. ఓటమి ఖాయమనే ఆందోళనతోనే ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో బనగానపల్లి నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీచేసిన కాటసాని రామిరెడ్డి విజయం సాధించారు. అనంతరం 2014 ఎన్నికల్లో కాటసాని వైఎస్సార్ సీపీలో చేరి పోటీ చేసి ఓటమి చవిచూశారు. టీడీపీ నుంచి బరిలోకి దిగిన బీసీ జనార్ధన్ రెడ్డి కాటసానిపై విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో మళ్లీ వైఎస్సార్ సీపీ నుంచి కాటసాని బరిలోకి దిగగా.. జనార్ధన్ రెడ్డికే టీడీపీ టికెట్ కేటాయించింది. అనంతరం ప్రచారం మొదలుపెట్టిన ఆయనకు పరిస్థితి అర్థమైంది. నియోజకవర్గంలో పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని.. ఈసారి ఓటమి ఖాయమనే అంచనాతో పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *