రియల్ సంస్థల బడా స్కామ్?

BIG BUILDERS REAL SCAM

ప్రీ లాంచ్ సేల్స్.. సాఫ్ట్ లాంచ్ సేల్స్.. యూడీఎస్ స్కీమ్.. ఫిఫ్టీ పర్సెంట్ పేమెంట్ .. ఇలా హైదరాబాద్లో పలు రియల్ సంస్థలు అమాయక ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నాయి. తక్కువ రేటుకే ఫ్లాటు అంటూ మోసం చేస్తున్నారు. కాకపోతే వంద శాతం సొమ్ము ముందే కడితే ఈ ప్రయోజనం అంటున్నారు. యాభై శాతం సొమ్ము కడితే మరో రేటు అంటున్నారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, స్థానిక మున్సిపాలిటీల నుంచి అనుమతులు తీసుకోకుండా.. తెలంగాణ రెరా అథారిటీ ఫైనల్ అప్రూవల్ లేకుండానే ఈ మోసానికి పాల్పడుతున్నాయి. మరి, హైదరాబాద్లో గత మూడు సంవత్సరాల నుంచి ఏయే నిర్మాణ సంస్థలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయో తెలిస్తే ఎవరైనా ముక్కుమీద వేలు వేసుకోవాల్సిందే.

రియల్ సంస్థల మోసాలను అరికట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రెరా అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్రంలో బీజేపీ వచ్చాక ఇది కార్యరూపం దాల్చింది. తెలంగాణలో కూడా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా మాసబ్ ట్యాంకులోని డీటీసీపీ భవనంలో రెరా అథారిటీ ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో స్వయంగా మంత్రి కేటీఆర్, బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రెరా అథారిటీ ప్రకారం.. 500 గజాలు లేదా ఆపై విస్తీర్ణంలో ఎనిమిది కంటే అధిక సంఖ్యలో ఫ్లాట్లు కట్టేవారు విధిగా రెరా నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల్ని అందుకున్న పలు నిర్మాణ సంస్థలు రెరా అథారిటీ వద్ద తమ ప్రాజెక్టులు నమోదు చేసుకున్నాయి.

మరెక్కడ సమస్య?

రెరా అథారిటీ వద్ద అనుమతి తీసుకోవాలనే నిబంధనను పలు నిర్మాణ సంస్థలు తుంగలో తొక్కడం ఆరంభించాయి. స్థానిక సంస్థల వద్దకు వెళ్లకుండా, రెరా నుంచి అనుమతి తీసుకోకముందే యూడీఎస్ విధానంలో ఫ్లాట్లు అమ్మడం ఆరంభించాయి. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, చిన్న కంపెనీల కంటే బడా నిర్మాణ సంస్థలే ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయి. మార్కెట్ రేటు కంటే తక్కువకు వస్తున్నాయనే ఉద్దేశ్యంతో అధిక శాతం కొనుగోలుదారులు వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. ప్రధానంగా, మార్కెట్లో కాస్తోకూస్తో పేరున్న నిర్మాణ సంస్థల వద్ద వీరు కొంటున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాల్ని నిర్వహించే పలువురు డెవలపర్లు అక్రమ పద్ధతుల్లో ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. గత రెండు, మూడేళ్ల నుంచి ఇలాంటి అక్రమాలు జరుపుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తోంది. రెరా అనుమతి లేకుండా అమాయక ప్రజలకు కుచ్చుటోపి పెడుతున్న రియల్ సంస్థలపై ఎలాంటి చర్యల్ని తీసుకోవడం లేదు.

కరోనా దెబ్బకు కొందరు విలవిల

సగం ధరకే ఫ్లాటు వస్తుందని ఆశ పడే అమాయక కొనుగోలుదారులు పీఎఫ్ సొమ్మును మొత్తం ఊడ్చేసి, తల్లిదండ్రులు, అత్తమామల నుంచి చేబదులు తీసుకుని, మిత్రుల నుంచి అప్పు తీసుకుని మరీ ఈ డెవలపర్ల చేతిలో సొమ్ము పోశారు. ఇలాంటి వారిలో కొందరు కరోనా వల్ల తమ డబ్బు వెనక్కి ఇచ్చేయమని పలు నిర్మాణ సంస్థల మీద ఒత్తిడి తెస్తున్నారు. అదే కరోనా వల్ల దారుణంగా దెబ్బతిన్న కొందరు డెవలపర్లు సొమ్ము ఇవ్వలేకపోతున్నారు. దీంతో చాలామంది కొనుగోలుదారుల్లో ఒకరకమైన ఆందోళన ఆరంభమైంది. తమ సొమ్ముకు భద్రత ఉంటుందా అనే సందేహం మొదలైంది. నిర్మాణ పనులు ఆరంభం కాకపోవడంతో బయ్యర్లు టెన్షన్ పడుతున్నారు.

ఇప్పటికైనా తెలంగాణ రెరా అథారిటీ కళ్లు తెరుచుకుని.. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా లో PRE LAUNCH SALES చేస్తే సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలకు పాల్పడకుండా ఉండేలా భారీ జరిమానాలు విధించాలని పలువురు డెవలపర్లు కోరుతున్నారు.

HYDERABAD REAL ESTATE NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *