టీడీపీ గూటికి బైరెడ్డి రాజశేఖరరెడ్డి

Spread the love

BIREDDY WILL JOIN IN TDP

  • శ్రీశైలం అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని వినతి
  • రాజకీయాల నుంచి వైదొలిగిన ప్రస్తుత అభ్యర్థి బుడ్డా
  • ఆ స్థానం ఖాళీ కావడంతో రంగంలోకి బైరెడ్డి

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ మార్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఒక పార్టీలో సీటు దక్కని అసంతృప్తి నేతలు మరో పార్టీ వైపు చూస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఇప్పటికే మొత్తం 175 స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఇక అక్కడ ఎలాంటి ఖాళీలు లేవు. అయితే, అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం కొన్నిచోట్ల ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ వైపు నేతలు చూస్తున్నారు. తాజాగా కర్నూలుకు చెందిన నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన ఆయన త్వరలో సొంతగూటికి చేరుకోనున్నారు. గతంలో టీడీపీలో ఉన్న ఆయన రాష్ట్ర విభజనకు ముందు ఆ పార్టీని వీడారు. అనంతరం రాయలసీమ హక్కుల కోసం పోరాడారు. ఈ క్రమంలో ఓ పార్టీని కూడా నెలకొల్పారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఆయన ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా టీడీపీ అధిష్టానంతో మంతనాలు జరుపుతున్నారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే, ప్రస్తుత టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు సోమవారం ప్రకటించారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ క్రమంలో ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని బైరెడ్డి టీడీపీ పెద్దలను కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు టీడీపీ కూడా అంగీకరించే అవకాశం ఉంది.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *