వారి ధైర్యం బీజేపీనా?

BJP BEHIND TRS REBELS?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలో రోజురోజుకూ లుకలుకలు పెరుగుతున్నాయి. ధిక్కారం, తిరుగుబాటు అనే పదాలే లేని ఆ పార్టీలో పరిస్థితి మారుతోంది. అధినేత కేసీఆర్ ఏది చెబితే అదే ఫైనల్ అనే స్థితి నుంచి అధినేతనే ప్రశ్నించే స్థాయికి మార్పులు కనిపిస్తున్నాయి. తాజాగా జరిపిన మంత్రివర్గ విస్తరణతో పార్టీలోని అసంతృప్తి రాగాలు ఒక్కసారిగా బయటకు వస్తున్నాయి. కొన్ని అంశాల్లో కేసీఆర్ తీరు పట్ల అసంతృప్తి ఉన్నప్పటికీ బయటకు చెప్పే పరిస్థితి గానీ, విభేదించే సీన్ గానీ ఉండేది కాదు. ఒకవేళ అలా విభేదించాల్సి వస్తే పార్టీలో స్థానం ఉండదని వారికి తెలుసు. అందుకే ఏ ఒక్క అంశంలోనూ అధినేతను విమర్శించే సాహసం ఎవరూ చేయలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కేసీఆర్ పై నిరసన గళాలు వినిపించే నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్ తో ప్రారంభమైన ఈ ప్రస్థానం.. ఇంకా కొనసాగుతోంది. ఈటల తర్వాత ఎమ్మెల్య రసమయి బాలకిషన్ విమర్శలు చేయగా.. తాజాగా మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి బాహటంగానే సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. మాట ఇచ్చి తప్పారంటూ విమర్శించారు.

ఇది ఆయనతోనే ఆగిపోలేదు. మంత్రి పదవి దక్కనందుకు నిరసనగా జోగు రామన్న తన గనమెన్లను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయారు. ఫోన్ కి కూడా దొరకడంలేదని సమాచారం. ఇక మరో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అసెంబ్లీకి డుమ్మా కొట్టి నిరసన తెలిపారు. ఇంకా కడియం శ్రీహరి, తాటికొండ రాజయ్య వంటి సీనియర్ నేతలు సైతం బయటకు నేరుగా చెప్పకపోయినా అసంతృప్తితో రగలిపోతున్నారు. ఇంతకీ వీరంతా ఇలా అసమ్మతి రాగం వినిపించడానికి కారణం ఎవరు? ఎవరిని చూసి వారు ధైర్యంతో ఇలా చేస్తున్నారా అని ఆలోచిస్తే.. కమలనాథులే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో సరైన ప్రత్యామ్నాయం లేదని, కానీ బీజేపీ రూపంలో వారికి ఓ ఆశ కనిపిస్తోందని అంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండ ఉంటే తమకు ఎలాంటి సమస్యా ఉండదని భావిస్తున్నారని చెబుతున్నారు. పైగా తెలంగాణలో బలపడాలనే లక్ష్యంతో ముందుకు కదులుతున్న కాషాయదళానికి ఇలాంటి నేతల అవసరం గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక టీఆర్ఎస్ లో తమకు పదవులు రావు అనుకునే వారంతా నిరసన గళం వినిపిస్తున్నారని తెలుస్తోంది.

TS POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *