రాజ‌ధాని ర‌భ‌స‌కు తెర దించిన బొత్స

Bothsa Satyanarayana About AP Capital
న‌వ్యాంధ్ర రాజ‌ధాని అమ‌రావ‌తికి సంబంధించి ఇంత‌కాలం రేగుతున్న వాద, ప్ర‌తివాదాల‌ను ప‌రిష్క‌రిస్తూ పుర‌పాల‌క‌, పట్ట‌ణాభివృద్ధి శాఖ అమాత్యులు బొత్స స‌త్యనారాయ‌ణ క్లారిఫికేష‌న్ ఇవ్వ‌డంతో టీడీపీ వ‌ర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇంత‌కాలం రాజ‌కీయ ర‌భ‌స అన్న‌ది రాజ‌ధాని మార్పున‌కు సంబంధించి చోటుచేసుకోవ‌డం, వాటికి అనుగుణంగా ప‌రిణామాలు సైతం వేగం వేగంగా క‌ద‌లిపోవ‌డం అన్న‌వి విధిత‌మే! ఈ నేప‌థ్యంలో రాజ‌కీయం రస‌కందాయంలో ప‌డింది.. ఇదే విష‌య‌మై కేంద్రం వ‌ర‌కూ సెగ‌లు తాకాయి.. టీడీపీ త‌మ మాన‌స పుత్రిక రాజ‌ధాని అమ‌రావ‌తి అంటూ ఎక్క‌డ లేని ప్రేమ‌నూ ఒల‌క‌బోసింద‌ని, అస‌లీ క‌ట్ట‌డాల‌కూ ప‌టిష్ట‌త కానీ ఆ నిర్మాణాల‌కు సౌష్ట‌వ‌త కానీ లేవ‌ని వైఎస్సార్సీపీ నాయ‌కులు మండిప‌డుతున్నారు.
కేవ‌లం గ్రాఫిక్స్ హంగామా త‌ప్ప రాజ‌ధాని విష‌య‌మై ఎటువంటి స్ప‌ష్ట‌తా కానీ ఆకృతుల విష‌య‌మై సింగ‌పూర్ ఇంజ‌నీర్ల‌తో మంత‌నాలు నెర‌పారే కానీ అధికారంలో ఉన్న‌న్నాళ్లూ సంబంధిత ప‌నులు వేగ‌వంతం చేయ‌లేక‌పోగా, ప్ర‌చార ప‌టాటోపానికే ప్రాధాన్యం ఇచ్చార‌ని వారంతా అసెంబ్లీ సాక్షిగా గ‌ళ‌మెత్తారు. ఈ నేప‌థ్యంలో బొత్స సైతం రాజ‌ధాని అన్న‌ది అంత అనుకూల ప్రాంతంలో నిర్మాణానికి నోచుకునేలా చేయ‌లేద‌ని, ఇది పూర్తిగా ఒకరికి ప్ర‌యోజ‌న క‌లిగించే విష‌య‌మే త‌ప్ప ఇందులో స‌మూహ ప్ర‌యోజ‌నాలు అన్న‌వి శూన్యం అని మండిప‌డ్డారు. ఇదే ద‌శ‌లో రాజ‌ధాని మార్పున‌కు సంబంధించి కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు సైతం చేశారు.. గ‌ట్టిగా ఓ వాన ప‌డితే పుట్టి మునిగిపోయే ప్రాంతంలో చంద్ర‌బాబు నాయుడు త‌న స్వ ప్ర‌యోజ‌నాల‌కే ప్రాధాన్యం ఇస్తూ, త‌న వారికి చెందిన కంపెనీల‌కే నిర్మాణ ప‌నుల‌నూ సంబంధిత కాంట్రాక్టుల‌నూ ఇస్తూ ఐదేళ్ల కాలం హాయిగా గ‌డిపేశార‌ని తాము అధికారంలోకి వ‌చ్చాక ఇవ‌న్నీ వెలుగులోకి వ‌స్తున్నాయ‌ని, అందుకే రాజ‌ధాని మార్పున‌కు సంబంధించి కూడా ఒక ఆలోచ‌న అన్న‌ది చేస్తున్నామ‌ని కొన్ని సంద‌ర్బాల్లో మీడియాకు వివ‌ర‌ణ ఇస్తూ వ‌చ్చారు.
ఈ వివ‌రం అందుకున్న చంద్ర‌బాబు నాయుడు త‌న‌పైనో మ‌రొక‌రిపైనో కోపంతోనో క‌క్ష  సాధింపు చ‌ర్య‌ల‌లో భాగంగానో అమ‌రావ‌తి నిర్మాణాలునిలిపివేసి, రాజ‌ధానిని మ‌రొక చోటుకు త‌ర‌లించుకుపోవ‌డం అన్న‌ది స‌బ‌బు కాద‌ని వ్యాఖ్యానిస్తూ, అసెంబ్లీలో ముఖ్య‌మంత్రినిఉద్దేశిస్తూ తాము గ‌తంలో ఎంపిక చేసిన తీరులో భాగంగా అమ‌రావ‌తినే రాజ‌ధానిగా ఉంచాల‌ని, ఇప్ప‌టికే కొన్ని నిర్ణ‌యాలు, నిర్మాణ ప‌నులు పూర్త‌య్యాయ‌ని పేర్కొంటూ కీల‌క ప్ర‌సంగం ఒక‌టి గ‌త సంద‌ర్భాల్లో చేశారు.
కానీ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆలోచ‌న‌లుమాత్రం వీటికి భిన్నంగా ఉంటున్నాయంటూ టీడీపీ వివిధ ప‌ద్ద‌తుల్లో ఆందోళ‌న‌లూ చేసింది. విష‌యం కేంద్రం వ‌ర‌కూ తీసుకుని వెళ్లింది. అస‌లెందుకు ఇదంతా ప‌దేళ్ల ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద్రాబాద్ ను ఉంచిన‌ప్పుడు మీరు కేవ‌లం ఓటుకు నోటు కేసుకుభ‌య‌ప‌డే ప‌రుగు ప‌రుగున ఇటుగా వ‌చ్చేశారు క‌దా! అందుక‌నే అమ‌రావ‌తి నిర్మాణం పేరిట మీరు త‌ల‌దాచుకునేందుకు సంబంధిత ప‌నులను త‌ల‌చిందే త‌డ‌వుగా అనుకూల వ‌ర్గీయుల సాయంతో చేపట్టారు క‌దా! అంటూ వైఎస్సార్సీపీ కీల‌క నేత‌లుఅసెంబ్లీ సాక్షిగానే చంద్ర‌బాబు నాయుడును టార్గెట్ చేశారు. దీనిపై టీడీపీ అధినేత, ప్ర‌స్తుత విప‌క్ష నేత స‌మాధానం ఎలా ఉన్న‌ప్ప‌టికీ రాజ‌ధాని మార్పున‌కు సంబంధించి ఎటువంటి చ‌ర్య‌లు ఉంటాయో అన్న భ‌యం, ఒక‌వేళ అదే జ‌రిగితే త‌మ వ‌ర్గీయుల‌కు ఏవిధంగా స‌మాధానం ఇచ్చుకోవాలో తెలియ‌ని అయోమ‌యం అన్న‌వి తెలుగుదేశం పార్టీ వ‌ర్గీయుల్లో బ‌లీయంగా
నాటుకుంది. ఈ త‌రుణంలో నిన్న‌టి వేళ  రాజ‌ధాని విష‌య‌మై శాస‌న మండ‌లిలో టీడీపీ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు  మంత్రి బొత్స ఓ లిఖిత పూర్వక స‌మాధానం ఇవ్వ‌డంతో ఈ వివాదానికి తెర  ప‌డింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *