BT and UT Issue In Trs
అదేంటో గానీ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే టీఆర్ఎస్ లో లుకలుకలు ఆరంభమయ్యాయి. టీఆర్ఎస్లో రెండు బ్యాచులున్నాయనే విషయం తెలిసిందే. ఉద్యమ తెలంగాణ జట్టు ఒకటి కాగా, బంగారు తెలంగాణ బ్యాచ్ మరోటి. అయితే, ప్రస్తుతమున్న కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు గత జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్లో చేరారు. అప్పటికే టీఆర్ఎస్ తరఫున గెలిచిన కార్పొరేటర్లకు ప్రస్తుతం సీట్లు ఇవ్వకూడదని సదరు ఎమ్మెల్యేలు కేటీఆర్ మీద ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు, సిట్టింగ్ కార్పొరేటర్లు ఎమ్మెల్యేల మీద గరంగరం అవుతున్నారు. ‘వారి కంటే ముందు తాము టీఆర్ఎస్ పార్టీలో చేరామని, అప్పటికే గెలిచామని, కాబట్టి తమకే సీటు ఇవ్వాలని పట్టు బడుతున్నారు. ఈ క్రమంలో తమకు అందుబాటులో ఉన్న వనరులన్నీ కార్పొరేటర్లు వినియోగిస్తున్నారు. కొందరు ఎంపీ సంతోష్ తో కాంటాక్టులో ఉండగా మరికొందరు ఎమ్మెల్సీ కవిత ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ప్రస్తతమున్న కార్పొరేటర్లు గెలవరని, కాబట్టి తాము సూచించిన వారికే సీట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు పట్టుబడుతుండగా అధికార పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతుందని సమాచారం. అయితే, పెద్దగా సమయం లేదు కాబట్టి ఏ నిర్ణయం తీసుకుంటే ఏమవుతుందేమోనని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోందని తెలిసింది. ఎందుకంటే, సిట్టింగ్ కార్పొరేటర్లకు సీట్లు ఇవ్వకపోెతే వారు వెంటనే బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని టీఆర్ఎస్ పార్టీకి అర్థమైంది. అయితే, తాము సూచించిన వారికి టికెట్లు మంజూరు చేయకపోతే, గెలుపు కష్టమని ఎమ్మెల్యేలు అంటున్నారు. అందుకే, ఈ సమస్యను ఎలా అధిగమించాలనే విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. మొత్తానికి ఉద్యమ తెలంగాణ, బంగారు తెలంగాణ బ్యాచ్ లో టికెట్ ఎవరికి లభిస్తుందో.. అందులో గెలిచేవారెవ్వరో తెలియాలంటే మరికొంతకాలం వేచి చూస్తే సరిపోతుంది.