bunny in krish route
కరోనా వల్ల అన్ని దేశాలూ నష్టపోతున్నాయి. సినిమా పరిశ్రమల పరిస్థితీ అంతే. ఇండియాలో ఈ నష్టం ఇంకా చాలానే ఉంది. మామూలుగా హాలీవుడ్ కు భిన్నంగా భారీ జనాల మధ్య మనవాళ్లు షూటింగ్స్ చేస్తుంటారు. అందువల్ల వీరికి అంత సులువుగా పర్మిషన్ వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో సౌత్ లో అందరికంటే ఎక్కువగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా నష్టపోయింది. యస్.. ఈ సమ్మర్ టైమ్ లో సుకుమార్ డైరెక్షన్ లో వస్తోన్న ‘పుష్ప’చిత్ర షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. అంటే సినిమా అంతా కాదు. ఇందులో మేజర్ గా ఉండే ఫారెస్ట్ పార్ట్ మొత్తం చిత్రీకరించాలనుకున్నారు. తీరా షూటింగ్ మొదలవగానే లాక్ డౌన్ ఎనౌన్స్ అయింది. దీంతో అందర్లానే ఆగిపోయారు. అయితే పుష్ప విషయంలో ఈ ఇబ్బంది ఇంకా ఎక్కువగా ఉంటుంది. అంత పెద్ద అడవిని సెట్ చేయలేరు. గ్రాఫిక్స్ లోనూ తీయలేరు. అందుకే మళ్లీ లాక్ డౌన్ ఎత్తేసేంత వరకూ ఆగాల్సిందే. ఇప్పటికే కొంత పర్మిషన్ ఉన్నా పుష్పకు వాతావరణం అనుకూలంగా లేదు. అయినా వచ్చే సమ్మర్ లో ఎలాగైనా విడుదల చేయాలనే ప్రయత్నాల్లో స్ట్రాంగ్ గా ఉంది టీమ్.
ఇందుకోసం వీళ్లు కూడా దర్శకుడు క్రిష్ ను ఫాలో కావాలని చూస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. చిరంజీవి మరో మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న మూవీ ఇది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. పూర్తిగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా చిత్రీకరణ ఆల్రెడీ సాగుతోంది. వికారాబాద్ అడవుల్లో క్రిష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దీంతో సుకుమార్ కూడా ఇప్పటికే వికారాబాద్ అడవుల్లో తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాలను పరిశీలించి వచ్చారట. అల్లు అర్జున్ ఓకే అంటే వెంటనే అక్కడ షూటింగ్ మొదలుపెట్టాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ అల్లు అర్జున్ ఇప్పుడు కుదరదు అని చెప్పినా.. మిగతా పార్ట్ ను చిత్రీకరించే అవకాశం ఉందంటున్నారు. కాకపోతే ఈ మూవీ కోసం చాలామంది క్రూను తీసుకున్నాడు సుకుమార్. మరి వారందరితో ఇలా భారీ స్థాయిలో చిత్రీకరణ జరపడం చాలా రిస్క్. ఆ రిస్క్ ను తీసుకుని స్టెప్ వేస్తారా లేక సమ్మర్ విడుదలను కూడా వాయిదా వేసుకుంటారా అనేది చూడాలి.