Car Companies agreement for Leasing the Cars
ఆర్థికమాంద్యం ఎఫెక్ట్ దేశాన్ని కుదేలు చేస్తోంది. ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికే పలు కంపెనీలు కార్ల అమ్మకాలు ఘోరంగా పడిపోవడంతో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. మాంద్యం దెబ్బకు కార్ల కంపెనీలు ఈ ఉపద్రవం నుంచి బయటపడడానికి కొత్త ఆలోచనలు చేస్తున్నాయి. ఐటీ సహా అందరూ ఉద్యోగులు ఇప్పుడు కార్లు కొనడానికి వెనుకాడుతున్నారు. తాజాగా కార్ల కంపెనీలు సరికొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కార్లను అద్దెకిచ్చే ‘రేవ్’ సంస్థతో రెండు దిగ్గజ కార్ల కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తమ కొత్త కార్లను అద్దెకు ఇచ్చేందుకు రెడీ అవ్వడం పారిశ్రామికవర్గాల్లో పరిస్థితికి అద్దం పడుతోంది.ఇప్పుడు దేశంలో దీర్ఘాకాలానికి మూడు నాలుగేళ్లకు నెలకు కార్లు అద్దెకు తీసుకునే సంస్కృతి పెరిగింది. ఇది కూడా కార్లు కొనకపోవడానికి కారణమవుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘రేవ్’ అనే సంస్థలు వెలువడం విశేషం. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న రేవ్ ఇప్పుడు పాపులర్ అయ్యింది. ఇప్పటికే పడిపోయిన కార్ల అమ్మకాలతో హ్యుండాయ్ ఇండియా కార్ల కంపెనీ రేవ్ తో జతకట్టింది. కార్లను అద్దెకు ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడు మరో కంపెనీ మహీంద్రా కూడా రేవ్ తో జతకట్టడం గమనార్హం.
వాహనాన్ని కొనుగోలు చేయకుండా వినియోగదారులు తమకు నచ్చిన కొత్త వాహనాన్ని అందుబాటు ధరల్లోనే తీసుకొని నచ్చినంత కాలం నడుపుకోవచ్చని ‘రేవ్’ సంస్థ చెబుతోంది. ఢిల్లీ – అహ్మదాబాద్ – ముంబై – పుణె – బెంగళూరు – హైదరాబాద్ – కోల్ కతా – చండీగడ్ లలో ఆ వసతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త ఆలోచనలతో కార్ల కంపెనీలు కూడా పడిపోయిన అమ్మకాలతో కార్లను అద్దెకు ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. తాజాగా మహీంద్రా కంపెనీ కారు నెల వారీ కారు అద్దెను రూ.19720గా ప్రారంభించింది. ఇక లగ్జరీ కార్లకు ఇంకాస్త ధర జోడించి కార్లను అద్దెకు ఇష్తోంది. ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఈ స్కీమ్ లో వాహనాన్ని పొందవచ్చు. డౌన్ పేమెంట్ – రోడ్ టాక్స్ వంటివి ఏమీ ఉండవు. వాహన రీసేల్ రిస్క్ ఉండదు. కస్టమర్ కట్టే బిల్లులోనే బీమా – మెయింటెనెన్స్ ఉండడంతో ఈ కొత్త కార్ల అద్దెకు పద్ధతి జనాలను ఆకర్షిస్తోంది. అందరూ కొనకుండా అద్దెకు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్టుగా మార్కెట్లో నిలబడడానికి కార్ల కంపెనీలు అద్దెకు కార్లు ఇస్తామంటూ ప్రయత్నాలు చేస్తున్నాయి.