ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయలేం

CEC ARORA ON EVMS

  • అవి పనిచేయకపోవచ్చు.. కానీ ట్యాంపర్ సాధ్యం కాదు
  • ఏపీలో 45 ఈవీఎంలలోనే సమస్యలు
  • కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అరోరా వెల్లడి

ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా స్పష్టంచేశారు. వాటిలోనే ఏవైనా లోపాలుంటే పనిచేయకపోవచ్చని, కానీ ట్యాంపరింగ్ చేయడం మాత్రం కుదరదని పేర్కొన్నారు. ఈవీఎంలను ట్యాంపర్ చేయొచ్చంటూ పలు రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలని వ్యాఖ్యానించారు. తొలి దశ ఎన్నికల నిర్వహణ తీరుపై ఆయన ఓ టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈవీఎంల పనితీరు గురించి వివరించారు. ఈవీఎంలన్నీ వేటికవే ఉంటాయని, అవి ఒకదానితో మరొకటి లింక్ అయి ఉండవని, అందువల్ల వాటిని ట్యాంపర్ చేయడం అసాధ్యమని స్పష్టంచేశారు. ఇక ఏపీలో పోలింగ్ తీరుపై అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న విమర్శలను ప్రస్తావించగా.. అక్కడ కేవలం 45 ఈవీఎంలలో మాత్రమే సమస్యలు తలెత్తాయని చెప్పారు. ఆ సంఖ్యలో కొంచెం తేడా ఉండొచ్చు కానీ, మరీ భారీ స్థాయిలో సమస్యలు వచ్చిన దాఖలాలు మాత్రం లేవన్నారు. ఏపీ ఎన్నికల్లో దాదాపు 45 వేల ఈవీఎంలు వాడగా.. కేవలం 45 ఈవీఎంలలోనే సమస్యలు వచ్చాయని, ఇది చాలా తక్కువ అని వివరించారు.

అలాగే ఫలితాల్లో పారదర్శకత కోసం 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలన్ని డిమాండ్ ను అరోరా తోసిపుచ్చారు. ఒక రోగికి 20 పరీక్షలు చేయాలంటే ఒక చోట నుంచి రక్త నమూనా సేకరిస్తారా లేక 20 చోట్ల నుంచి రక్తాన్ని తీసుకుంటారా అని ప్రశ్నించారు. 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కించాలనే వాదన సరికాదన్నారు. రెండు దశాబ్దాలుగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నామని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీలో ఒక పార్టీ గెలవగా.. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మరో పార్టీ గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. ఇప్పటివరకు తాము 1500 వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించామని, ఎక్కడా పొరపాటు జరిగినట్టు తేలలేదని వివరించారు. ఈ సారి ఎన్నికల ఫలితాల సందర్భంగా సుప్రీంకోర్టు సూచనల మేరకే ముందుకెళతామని ఆరోరా చెప్పారు. ఎమ్మెల్యే నియోజకవర్గానికి సంబంధించి ర్యాండమ్ గా ఎంపిక చేసిన 5 వీవీ ప్యాట్ స్లిప్పులు, ఎంపీ స్థానానికి సంబంధించి 35 వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కిస్తామని వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీచేసినట్టు వెల్లడించారు. ఒకవేళ ఏ అభ్యర్థికైనా ఓ పోలింగ్ బూత్ లో వచ్చిన ఫలితంపై అనుమానం ఉంటే సదరు బూత్ కి సంబంధించిన వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలంటూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దానిపై రిటర్నింగ్ అధికారి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *