Chandrababu’s home in flood threat
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి వల్ల కృష్ణానది కరకట్ట పై ఉన్న చంద్రబాబు నివాసాన్ని వరద ముంచెత్తే ప్రమాదముందని తెలియడంతో ఏపీ మంత్రులు కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ లింగమనేని గెస్ట్ హౌస్ వద్ద పరిస్థితిని పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వరద భయం తో చంద్రబాబు తన నివాసాన్ని ఖాళీ చేసి హైదరాబాదుకు పారిపోయారని కన్నబాబు ఎద్దేవా చేశారు. చంద్రబాబు మంచి కోసం ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు పట్టించుకోలేదని, రాజకీయం చేయాలని చూశారని వారి విమర్శలు గుప్పించారు. ఇప్పుడు వరద తోటి ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చాయో అర్థం అవుతుందా అంటూ వ్యాఖ్యలు చేశారు మంత్రులు.
కృష్ణా, గోదావరి నదులు ఉప్పొంగడంతో వరదలు పోటెత్తుతున్నాయని చెప్పిన మంత్రులు ఇప్పటికే ముంపుకు గురవుతాయన్న అనుమానమున్న లోతట్టు ప్రాంతాల పరిస్థితులను సమీక్షించారు. నాగాయలంక, కంచికచర్ల, భవానీపురం ప్రాంతాల్లో.. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించినట్టు తెలిపారు. మునిగిపోయిన తర్వాత హడావుడి చేసే ప్రభుత్వం తమది కాదని మంత్రి కన్నబాబు వెల్లడించారు.మాజీ సీఎం చంద్రబాబు నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్నారని పేర్కొన్న మంత్రులు ఇప్పుడు చంద్రబాబు ఇంట్లోకి నీరు చేరి ఇసుక మేటలు వేస్తుందని తెలిపారు. ఇంట్లోకి వరద రావడంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలు పోక హైదరాబాద్ పారిపోయే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ మంచి చెప్పినా రాజకీయకోణంలో చూసి చంద్రబాబు అల్లరి చేశారని ఆరోపించారు. ఇక ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయింది ఎవరో తెలుసుకోవాలని వెల్లంపల్లి పేర్కొన్నారు. తాము మంచికి చెప్పినా చంద్రబాబు వినిపించుకోలేదని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద ఉధృతి మరింత పెరిగితే చంద్రబాబు నివాసం పూర్తిగా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో ప్రస్తుతం చంద్రబాబు నివాసం ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ తొలి అంతస్తులోని సామాగ్రి, ఫర్నీచర్ ను రెండో అంతస్తులోకి తరలించినట్టు తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజ్ లో మరో రెండడుగుల మేరకు నీరు చేరితే చంద్రబాబు నివాసం తో పాటుగా,దాన్ని ఆనుకుని ఉన్న రహదారిపై వరకూ నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు.
|
|
వరద ముంపులో చంద్రబాబు నివాసం..
