Cheating Case Filed Against Indu Projects MD
హైదరాబాద్ కు చెందిన నిర్మాణ సంస్థ ఇందూ ప్రాజెక్ట్స్ ఎండీ శ్యాంప్రసాద్ రెడ్డి, డైరెక్టర్ దయాకర్ రెడ్డిపై ఇందూ ఫార్య్చూన్ ఫీల్డ్స్ ద అనెక్స్ ఓనర్ల సంఘం సోమవారం సైబరాబాద్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. కేపీహెచ్బీ కాలనీలోని హైటెక్ సిటీ ఎంఎంటీఎస్ స్టేషన్ చేరువలో ఇందూ ప్రాజెక్ట్స్ సంస్థ ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అనెక్స్ అనే నిర్మాణాన్ని ప్రారంభించింది. 2019లో క్లబ్ హౌజ్ కొనుగోలుదారులకు అప్పగిస్తామని చెప్పి ఇంతవరకూ అందించలేదని సంఘ సభ్యులు కమిషనర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా, ఇంటి యజమానుల మీదే తప్పుడు కేసులు పెడుతూ మానసిన వేదనకు గురి చేస్తున్నారని తెలిపారు. 2019 మే చివరిలోపు ఈ ప్రాజెక్టులోని సమస్యలన్నీ పరిష్కరిస్తానని డెవలపర్ హామీ ఇచ్చారని, కానీ వాటిని నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. ఇదే విషయమై తాము ప్రశ్నిస్తే.. అంతుచూస్తానని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
– 2018 అక్టోబరు ఒకటో తేది నాడు ఏ మరియు బి బ్లాకులను తమకు అప్పగించినప్పటికీ, పలు సమస్యలను ఇంకా పూర్తిగా పరిష్కరించలేదని కమిషనర్ ద్రుష్టికి తీసుకొచ్చారు. 2014లో క్లబ్ హౌజ్ కోసం బిల్డర్ దాదాపు 2.27 కోట్లను వసూలు చేశాడని, అయినా ఇప్పటివరకూ క్లబ్ హౌజును తమకు అప్పగించలేదన్నారు. ఇందుకు సంబంధించి ఎన్ని సార్లు అడిగినా పట్టించకోవడం లేదని తెలిపారు. పైగా, సంఘ సభ్యుల్లో ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా వేధించడం మొదలుపెట్టాడని ఫిర్యాదుదారులు వాపోతున్నారు. ఇప్పుడేమో తాజాగా క్రిమినల్ కేసులను తమపై బుక్ చేస్తానని బెదిరిస్తున్నాడని కమిషనర్ ద్రుష్టికి తీసుకొచ్చారు. క్లబ్ హౌజ్ అప్పగించడంలో కావాలనే ఆలస్యం చేయడమే కాకుండా అక్రమంగా ఈ స్థలాన్ని వాడుకోవడం వల్ల నివాసితులకు పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. 2011లో గ్యాస్ పైపు లైను వేయడానికి రూ.58 లక్షలు వసూలు చేసినా.. తమ 234 ఫ్లాట్లకు ఆ సౌకర్యాన్ని నేటికీ అందజేయలేదని వాపోయారు. ఇలా, పలు అంశాల్లో ఇచ్చిన మాట నెరవేర్చకుండా తమను మోసం చేయడమే కాకుండా మానసికంగా వేధిస్తున్నందుకు బిల్డర్ శ్యాంప్రసాద్ రెడ్డి, డైరెక్టర్ దయాకర్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేయాలని కోరారు. దీంతో పోలీసులు 420, 406, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, ఇందూ ఫార్చ్యూన్ ఫీల్డ్స్ అనెక్స్ నివాసితుల సంఘం ఫైల్ చేసిన కేసు గురించి ఇందూ సంస్థ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Hyderabad Builders Cheating Buyers