పీవీపై చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Chinna Reddy Comments on PV

పీవీ పేరుతో తమను ఆట ఆడుకునే పార్టీలకు చెక్ చెప్పే ప్రయత్నంలో తెలంగాణ కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి పెద్ద సాహసమే చేశారు. పీవీని అవమానించిన వైనాన్ని ఆయన కన్ఫర్మ్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పీవీ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడటం గమనార్హం. పీవీ ఎంతోమంది సీనియర్ నేతల్ని తొక్కేశారన్నారు. పీవీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టిన వ్యక్తి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బాబ్రీ మసీదును కూల్చి పీవీ ఘోర తప్పిదం చేశారని.. అందువల్లే కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు దూరమయ్యారని.. ఆ తప్పిదం వల్లే ఆయన్ను గాంధీ కుటుంబం పక్కన పెట్టిందన్నారు. బాబ్రీ మసీదును కూల్చేందుకు సాయం చేసినందుకే బీజేపీ నేతలు పీవీని పొగుడుతున్నారన్నారు. ఇంతలా పీవీని విమర్శించిన చిన్నారెడ్డి అక్కడ ఆగకుండా మరో సీనియర్ నేత.. రాష్ట్రపతిగా వ్యవహరించిన ప్రణబ్ దాను వదల్లేదు. ప్రణబ్ సైతం పీవీలా తిన్నింటి వాసాలు లెక్కేసే వారన్న అర్థం వచ్చేలా తప్పుపట్టారు. ప్రణబ్ ను కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతిని చేస్తే.. ఆయనేమో నాగపూర్ సంఘ్ పరివార్ సభకు వెళ్లి భారతరత్న తెచ్చుకున్నారన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బీజేపీకి ఎలాంటి సాయం చేయనందుకే ఆయన్ను పొగడటం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా తన మీద అందరి దృష్టి పడేలా చేశారు.

జాతీయ అంశాలపై హాట్ వ్యాఖ్యలు చేసిన చిన్నారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తప్పు పట్టారు. తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమని ప్రభుత్వం చెబుతోందని.. రాష్ట్రానికి 1.10లక్షల కోట్ల అప్పు ఉందని కేంద్రమంత్రి సీతారామన్ చెప్పారన్నారు. అంత మొత్తాన్ని దేని కోసం ఖర్చు పెట్టారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గడిచిన కొంతకాలంగా పెదవి విప్పని చిన్నారెడ్డి ఒక్కసారిగా తన తీరుకు భిన్నంగా చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారతాయనటంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *