Chitralahari Movie Review and Rating

Chitralahari Movie Review and Rating
చిత్రం:  చిత్ర‌ల‌హ‌రి
న‌టీన‌టులు:  సాయిధ‌ర‌మ్‌తేజ్‌, నివేతా పేతురాజ్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, వెన్నెల కిశోర్‌, సునీల్, పోసాని కృష్ణ‌ముర‌ళి త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం:  కిశోర్ తిరుమ‌ల‌
ఎడిటింగ్:  శ్రీక‌ర ప్ర‌సాద్‌
కెమెరా:  కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని
సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌
సంస్థ‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్
నిర్మాత‌లు: న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్‌, సీవీఎం (సి.వి.మోహ‌న్‌)
విడుద‌ల‌: 11.4.2019
స‌మ్మ‌ర్ సినిమాల కోసం ప్రేక్ష‌కులు బాగా వెయిట్ చేస్తున్నారు. ఇటీవ‌ల విడుద‌లైన `మ‌జిలీ` కాస్త మంచి ప్రారంభాన్నే ఇచ్చింది. `మ‌జిలీ` ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఎక్కువ‌గా `పెళ్లి` అనే కాన్సెప్ట్ చుట్టూ తిరిగింది. కాబ‌ట్టి కుర్ర‌కారు క‌న్నా, ఫ్యామిలీ ఆడియ‌న్స్ నే టార్గెట్ చేసింది. కానీ చిత్ర‌ల‌హ‌రి అలాంటి సినిమా కాదు. అందుకే ఇప్పుడు అంద‌రి దృష్టీ `చిత్ర ల‌హ‌రి` మీద ఉంది. స‌క్సెస్ ఫెయిల్యూర్ గురించి అత్య‌ధికంగా డిస్క‌ష‌న్ వ‌చ్చే స‌మ‌యం స‌మ్మ‌ర్‌. రాసిన ప‌రీక్ష‌లు,చేరాల్సిన గ‌మ్యాల మ‌ధ్య అటు విద్యార్థులే కాదు, ఇటు త‌ల్లిదండ్రులు కూడా త‌ల‌లు ప‌ట్టుకునే స‌మ‌య‌మిది. స‌రిగ్గా ఇలాంటి స‌మ‌యంలో విడుద‌ల‌వుతున్న చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. నా పేరు విజ‌య్‌.. నా జీవితంలో లేనిదే అది.. అంటూ సాగే టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు ఇప్ప‌టికే మంచి స్పంద‌న వ‌చ్చింది. `ఓ ప్లేటు స‌క్సెస్ ప‌ట్టుకునిరా` అని సాయిధ‌ర‌మ్ తేజ్ అడుగుతున్న‌ట్టు ఓ సీన్ ఉంది. నిజ జీవితంలోనూ స‌క్సెస్ కోసం ఎదురుచూస్తున్న తేజ్‌కు ఈ సినిమా ఎంత వ‌ర‌కు క‌లిసొస్తుంది? ఎన్ని ప్లేట్లు స‌క్సెస్‌ను అందిస్తుంద‌నేది వేచి చూడాల్సిందే.
క‌థ‌
జీవితంలో ఫెయిల్యూర్‌కి చిరునామా విజ‌య్ (సాయి).యాక్సిడెంట్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉండేవాళ్ల గురించి ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రులు, ఆంబులెన్స్ లు, బ్ల‌డ్ బ్యాంక్‌ల‌కు చేరేలా ఓ యాప్‌ను రూపొందిస్తాడు. అది వ‌ర్కవుట్ కాద‌ని ఓ పేరు మోసిన కంపెనీ మేనేజ‌ర్ (బ్ర‌హ్మాజీ) చెప్ప‌డంతో డీలా ప‌డ‌తాడు. అయితే విజ‌య్ చెప్పిన ప్రాజెక్ట్ అక్క‌డే కూర్చున్న స్వేచ్ఛ (నివేద‌)కు క‌నెక్ట్ అవుతుంది. మ‌రోవైపు ల‌హ‌రి (క‌ల్యాణి) విజ‌య్ ప్రేమ‌కు ఓకే చెబుతుంది. అంతా స‌వ్యంగా సాగుతుంద‌నుకుంటున్న త‌రుణంలో ల‌హ‌రి హైద‌రాబాద్‌కు వ‌స్తుంది. అక్క‌డ ఆమె అనుకోకుండా త‌న  చిన్న నాటి స్నేహితురాలు స్వేచ్ఛ‌ను క‌లుస్తుంది. వారి మ‌ధ్య మాట‌లు అనుకోకుండా ల‌హ‌రి బోయ్ ఫ్రెండ్ వైపు మ‌ళ్లుతాయి. మ‌గ‌వాళ్ల ప్రేమ మీద పెద్ద‌గా ఒపీనియ‌న్ లేని స్వేచ్ఛ చెప్పే మాట‌లు ల‌హ‌రి మ‌న‌సులో అల‌జ‌డి సృష్టిస్తాయి. ఆమె విజ‌య్‌కు దూరంగా వెళ్తుంది. ల‌హ‌రి, స్వేచ్ఛ కు మ‌ధ్య ప‌రిచ‌యం ఉంద‌ని విజ‌య్‌కి తెలియ‌దు. ల‌హ‌రి దూరం కావ‌డంతో ప‌ని మీద ఫోక‌స్  చేస్తాడు విజ‌య్‌. ఆ క్ర‌మంలోనే స్వేచ్ఛ‌తో క‌లిసి త‌న ప్రాజెక్ట్ కోసం ముంబైకి చేరుకుంటాడు. అక్క‌డ అత‌నికి మ‌ర‌లా ల‌హ‌రి కనిపిస్తుంది. విడిపోయార‌నుకున్న వారిద్ద‌రూ మ‌ళ్లీ క‌లిశారా? స‌్వేచ్ఛ చేసిన సాయం ఏంటి విజ‌య్‌కి?  విజ‌య్ ప్రాజెక్ట్ మొద‌లుకావ‌డానికి స్వేచ్ఛ ఎలా కార‌ణ‌మైంది? అస‌లు విజ‌య్ కోర్టులో నిలుచోవ‌డానికి కార‌ణ‌మెవ‌రు?  విజ‌య్ తండ్రి చూపిన ఆద‌ర‌ణ ఎలాంటిది? వ‌ంటివ‌న్నీ తెలుసుకోవాలంటే `చిత్ర‌ల‌హ‌రి` చూడాల్సిందే.
ప్ల‌స్ పాయింట్స్
– పాట‌లు
– కెమెరా
– డైలాగులు
– న‌టీన‌టుల న‌ట‌న‌
మైన‌స్ పాయింట్లు
– తెలిసిన క‌థే
– పెద్ద ట్విస్టులు లేవు
– క‌థ ఇంకాస్త గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది
– డైలాగుల్లో ఉన్న ఇంటెన్స్ సీన్‌లో లేక‌పోవ‌డం
విశ్లేష‌ణ‌
స్వీటు భోజ‌నానికి ముందో, త‌ర్వాతో తింటే బాగానే ఉంటుంది. కానీ స్వీట్లనే భోజనం చేసిన‌ట్టు చేయ‌గ‌ల‌మా? అన్నీ తీపి వంట‌కాలే ఉంటే మొహం మొత్త‌దా…? స‌్వీట్ల ప్ర‌సంగం అసంద‌ర్భ‌మే అయినా, చిత్ర ల‌హ‌రి విష‌యంలో ఆలోచిస్తే ఇదే నిజ‌మ‌నిపిస్తుంది. గెల‌వాలంటే పోరాడాలి. ఓట‌మి మ‌న‌కు చాలా నేర్పిస్తుంది. ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నిస్తే కానిది ఏదీ లేదు. దేనికైనా ఓపిక కావాలి, పోయిన చోటు వెతుక్కోవాలి, గట్టిగా కృషి చేయాలి… ఈ విష‌యాల‌ను న‌మ్ముకుని అల్లుకున్న క‌థ ఇది. త‌ల్లీతండ్రి విడిపోవ‌డంతో, మ‌గ‌వాళ్లు ప్రేమ పేరుతో మోసం చేస్తార‌ని నిర్దారణ‌కు వచ్చేసిన ఓ అమ్మాయి, త‌న జీవితంలో సొంత నిర్ణ‌యాలు తీసుకోలేని ఓ అమ్మాయి ఆలోచ‌న‌ను త‌న మాట‌ల‌తో ప్ర‌భావితం చేస్తుంది. ఒకానొక సంద‌ర్భంలో త‌ను చేసింది త‌ప్పేమోన‌నే నిజాన్ని గ్ర‌హించ‌డం మొద‌లుపెట్టాక‌, స్నేహితురాలి జీవితాన్ని దిద్దాల‌ని అనుకుంటుంది. ఆ ప్ర‌భావం మొత్తం ఓ అబ్బాయి మీద ప‌డుతుంది. సినిమాలోనే ఓ డైలాగ్ ఉన్న‌ట్టు… ఒక‌ప్పుడు ప్రేమించుకునేవారికి త‌ల్లిదండ్రులు, కుటుంబాలు, కులాలు, స‌మాజం అడ్డుగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు, వాళ్ల మాన‌సిక ప‌రిస్థితులు, ఆలోచ‌నా విధాన‌మే వారి ప్రేమ‌కు శ‌త్రువుగా నిలుస్తుంది. ఈ సినిమాలోనూ ద‌ర్శ‌కుడు ఆ కాన్‌ఫ్లిక్ట్ ని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు. దానికి తోడు నాలుగు మంచి డైలాగులు రాసుకున్నాడు. టీజ‌ర్‌లోనూ, ట్రైల‌ర్‌లోనూ ఈ డైలాగుల్ని ఇప్ప‌టికే ప్రేక్ష‌కులు చాలా సార్లు వినేశారు. డైలాగులే అలా ఉంటే, వాటి తాలూకు ఎఫెక్ట్ ఇంకెంత‌లా ఉండాలి… కానీ తెర‌పై ఆశించినంత ఏమీ ఉండ‌దు. ఓ వైపు హీరో కులాసాగానే ఉంటాడు. మ‌రోవైపు ప్ర‌పంచంలో ఉన్న బాధ‌ల‌న్నీ త‌న‌కే ఉన్న‌ట్టు కుమిలిపోతుంటాడు. పైగా అత‌ని ప్ర‌య‌త్నాల్లో పెద్ద‌గా ఓట‌మిని చూసిన‌ట్టు కూడా ఏమీ అనిపించ‌దు. హీరోయిన్ కూడా అత‌న్ని కాద‌ని తెగించి వెళ్లిపోదు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఆమె అత‌న్ని ఎలా వ‌ద్ద‌నుకుంటుందో, అత‌ను వెంట‌నే ఆమెను కూడా వ‌ద్ద‌నుకున్న‌ట్టే బిహేవ్ చేస్తాడు. మ‌రి అత‌ను ప్ర‌త్యేకంగా పోగొట్టుకున్న‌దేంటో అర్థం కాదు. కాక‌పోతే గెలుపు తేలిగ్గా రాదు.. అని చెప్పే డైలాగులు మాత్రం ప‌దే ప‌దే వినిపిస్తాయి. వాటిని ప్రేక్ష‌కులు విన‌గ‌లిగితే సినిమా హిట్ అయిన‌ట్టే. కానీ సిల్వ‌ర్ స్క్రీన్ మీద చెప్పే పాఠాల‌ను ప్రేక్ష‌కులు ఏ మేర‌కు వింటార‌న్న‌ది ఆలోచించాల్సిన విష‌యమే.
రేటింగ్‌: 2.25/5
బాట‌మ్ లైన్‌:  ఫ‌ర్వాలేద‌నిపించే `చిత్ర‌ల‌హ‌రి`

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *