రాజ్యసభకు కవిత కు లైన్ క్లియర్

Clear Line To Rajya Sabha For Kavitha

కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఎట్టకేలకు రాజకీయాల్లో యాక్టివ్ కాబోతున్నారని సమాచారం తెలుస్తోంది.2019 మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి రెండోసారి పోటీ చేసిన కవిత అనూహ్యంగా బిజెపి అభ్యర్థి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. కవిత ఓటమిని ఆమె ఒక్కరే కాదు.. టిఆర్ఎస్ శ్రేణులు, ఆమె అభిమానులు నేటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు కవిత పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు కూడా లేవు.

ఓటమి పాలైన తర్వాత కొంత కాలం సైలెంట్‌గా వున్న కవిత తాజాగా జాతీయ అంశాలపై పెదవి విప్పుతున్నారు. జిడిపి గణనీయంగా తగ్గిన నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితిపై కవిత కొన్ని వివరాలతో ట్వీట్లు సంధించారు. తాజాగా ఈశాన్య భారతంలో రగులుతున్న ఆందోళనను ముందుగానే ప్రెడిక్ట్ చేసిన కవిత… సిటిజన్‌షిప్ (అమెండ్‌మెంట్) బిల్లులో లోపాలను ఎత్తిచూపారు. అదే సమయంలో తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయడంతో మోదీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని కవిత ఎత్తి చూపారు.

ఇలా జాతీయ అంశాలపై సమగ్ర అవగాహన కలిగి వున్న కవితను రాజ్యసభకు పంపాలన్న ఒత్తిడి గులాబీ దళపతిపై పెరుగుతున్నట్లు సమాచారం. దాంతో కవిత పేరుతోపాటు తనకు బంధువైన కరీంనగర్ మాజీ ఎంపీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పేరును కూడా కేసీఆర్ పరిశీలించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, వినోద్‌కు కేబినెట్ హోదా కలిగిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి ఆల్‌రెడీ ఇచ్చినందున తాజాగా రాజ్యసభ అభ్యర్థుల పరిశీలనలో ఆయన పేరును పక్కన పెట్టారని, దాంతో కవితకు లైన్ క్లియర్ అయ్యిందని తెలుస్తోంది. మరోపక్క రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కేశవరావుకు కూడా సీఎం కేసీఆర్ చెక్ పెడతారా అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

tags : kavitha, cm kcr, telangana, national, rajya sabha, former mp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *