కేసీఆర్ సారే కాపాడాలె

CM KCR MUST SUPPORT REALTY

* అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో తగ్గిన అమ్మకాలు
* క్యాలిఫోర్నియా, న్యూయార్క్‌లో తగ్గిన లగ్జరీ గృహాల విక్రయాలు
* అమ్ముడుపోని ఇండ్ల విలువ..రూ. 3.70 లక్షల కోట్ల
* 25-35 శాతం అమ్మకాలు తగ్గుముఖం
* హైదరాబాద్‌ నిర్మాణ రంగాన్ని సీఎం కాపాడాలి

కోవిడ్‌-19 పుణ్యమా అంటూ ప్రపంచవ్యాప్తంగా రియల్‌ రంగం కకావికలైంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నిర్మాణ రంగం 2009 తర్వాత భారీ స్థాయిలో పతనమైంది. దుబాయ్‌లో నిర్మాణ ప్రాజెక్టులన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అసలే ప్రపంచ ఆర్థిక సమస్యలు, బలహీనమైన క్రూడాయిల్‌ ధరలు దుబాయ్‌ రియల్‌ రంగాన్ని అతలాకుతలం చేస్తుంది. దీనికి తోడుగా కరోనా జత కలవడంతో బూర్జ్‌ ఖలీఫా కంటే ఎత్తయిన క్రీక్‌ హార్బర్‌ టవర్‌ పనుల్ని ఎమార్‌ సంస్థ నిలిపివేసింది. ఇటలీ, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, ఆస్ట్రియా వంటి దేశాల్లో రియల్‌ రంగంలో అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. ఆయా దేశాల్లో ఇంట్లో వినియోగించే శానిటరీ, హార్డ్‌వేర్‌ ఉత్పత్తుల గిరాకీ కూడా పూర్తిగా పడిపోయింది. అమెరికా రియల్‌ రంగంలోనూ కరోనా ప్రకంపనలు కనిపిస్తున్నాయి. న్యూయార్క్‌, క్యాలిఫోర్నియా వంటి నగరాల్లో లగ్జరీ గృహాల్ని కొనే వారిలో చైనీయులే ఎక్కువుంటారు. కరోనా నేపథ్యంలో కొనుగోలు చేసేవారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. అమెరికాలో మార్గిగేజ్‌ రేట్లు మార్చిలోనే అతితక్కువగా నమోదైంది. సరిగ్గా ఏడాది క్రితం నాలుగు నుంచి ఐదు శాతమున్న ఈ వడ్డీ రేట్లు 2020 మార్చిలో 3.29 శాతానికి పడిపోయింది. ఇంత తగ్గుదల 2012లో నమోదైందని నిపుణులు అంటున్నారు.

* భారతదేశ నిర్మాణ రంగంపై కోవిడ్‌-19 ప్రతికూల ప్రభావం చూపెడుతుందని కేపీఎంజీ తాజా అధ్యయనంలో తేల్చి చెప్పింది. ఎంతలేదన్నా ముప్పయ్‌ శాతం మంది ఉద్యోగాలు కోల్పోతారని వెల్లడించింది. సిమెంటు, ఉక్కు, ఇతర నిర్మాణ సామగ్రి తయారీ పని ఎక్కడికక్కడ నిలిచిపోయిందని తెలియజేసింది. అమ్మకాల్లేకపోవడంతో నివాస సముదాయాలు, ఆతిథ్య, రిటైల్‌ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది. ఈ పెను ఉత్పాతం నుంచి రియల్‌ రంగం గట్టెక్కాలంటే, డెవలపర్లు ఎదుర్కొనే ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపెట్టాలని, కనీసం పన్నెండు నెలల దాకా ప్రాజెక్టు రుణాలపై ఈఎంఐలు చెల్లించేందుకు సౌలభ్యాన్ని అందజేయాలని కేపీఎంజీ సూచించింది.

అమ్ముడుపోని ఇండ్ల విలువ..రూ. 3.70 లక్షల కోట్ల
2019 మార్చితో పోల్చితే 2020 మార్చిలో 29 శాతం నివాస గృహాల అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని జోన్స్‌ లాంగ్‌ లసాల్‌ తాజా అధ్యయనంలో వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో అమ్ముడుపోని ఇండ్ల విలువ దాదాపు రూ.3.70 లక్షల కోట్ల దాకా ఉంటుందని అంచనా వేసింది. కోవిడ్‌-19 ఉత్పాతం వల్ల నివాస గృహాల అమ్మకాలు సుమారు ముప్పయ్‌ శాతం తగ్గుముఖం పట్టాయి. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం కావడంతో ఇండ్లు కొనడానికి ప్రజలెవరూ ముందుకు రావడం లేదు. హైదరాబాద్‌లో ప్రస్తుతం అమ్ముడుకాని ఇండ్లు సుమారు 24,047 దాకా ఉంటాయి. వీటిని అమ్ముకోవడానికి సుమారు పద్దెనిమిది నెలలు పడుతుంది. ఇక్కడ నిలిచిపోయిన ఇండ్ల విలువ ఎంతలేదన్నా రూ.19,200 కోట్ల (192 బిలియన్లు) దాకా ఉంటుందని జేఎల్‌ఎల్‌ అంచనా వేసింది.

25-35 శాతం అమ్మకాలు తగ్గుముఖం
కరోనా నేపథ్యంలో 2020లో దేశవ్యాప్తంగా ఇండ్ల అమ్మకాలు కనీసం 25 నుంచి 35 శాతం మేరకు తగ్గుముఖం పడతాయని అనరాక్‌ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. ధరలు తగ్గుముఖం పడతాయనే ఆలోచన ఇందుకో ప్రధాన కారణమని తెలియజేసింది. ఇక, కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ ముప్పయ్‌ శాతం దాకా తగ్గుతుందని అంచనా వేసింది. కరోనా పుణ్యమా అంటూ దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 4.7 లక్షల గృహాల నిర్మాణ పనులు ఆలస్యమవుతుందని, హైదరాబాద్‌లో ప్రస్తుతం 64,250 ఇండ్ల అమ్మకాలు నిర్మాణంలో ఉన్నాయని వెల్లడించింది. నిధుల కొరత లేని ప్రాజెక్టుల్లో నిర్మాణ పనులు నిలిచిపోయే ప్రసక్తి ఉండదని, ఇతర ప్రాజెక్టులు ఎక్కువగా ఆలస్యమవుతాయని తెలియజేసింది. రూ.40 లక్షల్లోపు గృహాల్లో సైతం ఒకటి నుంచి రెండు శాతం దాకా అమ్ముడుకాని ఫ్లాట్లు ఉంటాయని పేర్కొన్నది.

సీఎం కేసీఆర్‌ ఉండగా.. మనకెందుకు దిగులు?
2008-09 మధ్యకాలంలో అమెరికా సబ్‌ ప్రైమ్‌ సమస్యను సమర్థంగా అధిగమించిన చరిత్ర హైదరాబాద్‌ నిర్మాణ రంగానికి ఉన్నది. గతంలో సబ్‌ప్రైమ్‌ సమస్య నుంచి అతిత్వరలో గట్టెక్కింది మన రియల్‌ రంగమే కావడం గమనార్హం. అంతెందుకు, కోవిడ్‌-19 రాక ముందు వరకూ దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్మాణ రంగం కునారిల్లుతుంటే, హైదరాబాద్‌లో మాత్రం మూడు పూవులు ఆరు కాయలుగా కొనసాగింది. దేశవ్యాప్తంగా రియల్‌ సంస్థల చూపు మొత్తం భాగ్యనగరం మీదే కేంద్రీకృతమైంది. జాతీయ, అంతర్జాతీయ ఐటీ సంస్థలు హైదరాబాద్‌లో వాణిజ్య సముదాయాన్ని తీసుకోవడానికి అధిక ఆసక్తి చూపెట్టారు. దీని వల్ల నివాస గృహాలకు మంచి గిరాకీ ఏర్పడింది. అయితే, కరోనా మన రియల్‌ రంగానికి తాత్కాలిక బ్రేకులు మాత్రమే వేసిందని, పరిస్థితులు సద్దుమణిగితే అంతా సాధారణ స్థితికి చేరుకుంటుందని క్రెడాయ్‌ హైదరాబాద్‌ మాజీ అధ్యక్షుడు ఎస్‌.రాంరెడ్డి తెలిపారు. ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా సమర్థంగా అధిగమించే సత్తా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదని, అందుకే మన రియల్‌ రంగానికొచ్చే నష్టమేం లేదని అభిప్రాయపడ్డారు. కోవిడ్‌ వల్ల ప్రాణనష్టాన్ని తప్పించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకుంటున్న నిర్ణయాలకు జాతీయ స్థాయిలో మంచి ప్రశంసలు లభిస్తున్నాయని క్రెడాయ్‌ తెలంగాణ ఛైర్మన్‌ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లినా, నిర్మాణరంగం కుప్పకూలినా ఎక్కువగా చింతించక్కర్లేదని, తెలంగాణ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి వైపు పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్రం ఎలాగూ రియల్ రంగాన్ని పట్టించుకోవడం మానేసింది. కనీసం తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఈ రంగానికి ఆపన్నహస్తం అందిస్తారని నిర్మాణ సంస్థలు ఎదురు చూస్తున్నాయి.

 

POST COVID REALTY 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *