తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సోమవారం శాసనసభ వేదికగా పీఆర్సీపై కీలక ప్రకటనలు చేశారు. ఉద్యోగులకు 30 శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, హోంగార్డులకు కూడా పీఆర్సీ వర్తిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ ఇస్తున్నట్టు వెల్లడించారు. ఈసారి కరోనా, ఇతర పరిస్థితుల కారణంగా పీఆర్సీ కొంత ఆలస్యమైందని చెప్పారు. దీనిపై అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. వీఆర్ఏలు, ఆశాలు, అంగన్ వాడీ కార్యకర్తలకు కూడా పీఆర్సీ వర్తింపజేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని రకాల, అన్ని స్థాయిల ఉద్యోగులకు వేతనాలు పెంపు వర్తిస్తుందన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచుతున్నట్టు తెలిపారు. రిటైర్మెంట్ గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచుతున్నట్టు చెప్పారు. టీచర్ల అంతర్ జిల్లాల బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.