చెన్నైకి హ్యాట్రిక్ విజయం

CSK THIRD WIN

  • రాజస్థాన్ రాయల్స్ పై గెలుపుతో పాయింట్లలో అగ్రస్థానం

ఐపీఎల్ తాజా సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడో విజయం నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేజిక్కించుకుంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో చెన్నై 8 పరుగులత విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓ దశలో విజయానికి చేరువగా వచ్చిన ఆ జట్టు చివరి ఓవర్లో చేతులెత్తేసింది. రాహుల్‌ త్రిపాఠి(39), స్మిత్‌(28), బెన్‌ స్టోక్స్‌(46)లు పోరాడినప్పటికీ, విజయాన్ని అందించలేకపోయారు. సీఎస్‌కే బౌలర్లలో దీపక్‌ చహర్‌, ఇమ్రాన్‌ తాహీర్‌, డ్వేన్‌ బ్రేవో, శార్దూల్‌ తలో రెండు వికెట్లు తీశారు.

అంతకు ముందు టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 27 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంబటి రాయుడు(1), షేన్‌ వాట్సన్‌(13), కేదార్‌ జాదవ్‌(8) వెంటవెంటనే ఔట్ అయ్యారు. ఆ తరుణంలో సురేశ్‌ రైనా-ఎంఎస్‌ ధోని జాగ్రత్తగా ఆడి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. వీరిద్దరూ  61 పరుగులు జత చేసిన తర్వాత రైనా పెవిలియన్‌ చేరగా, బ్రేవోతో కలిసి ధోని ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఈ క్రమంలో ధోని(75 నాటౌట్‌; 46 బంతుల్లో  4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఓవర్లో ధోని శివమెత్తాడు. ఆ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టి ప్రేక్షకులను ఊర్రూతలూగించాడు. దీంతో చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రాజస్థాన్‌ రాయల్స్‌ బౌలర్లలో ఆర్చర్‌ రెండు వికెట్లు సాధించగా, ధావల్‌ కులకర్ణి, బెన్‌స్టోక్స్‌, ఉనాద్కత్‌లు తలో వికెట్‌ తీశారు.

అనంతరం బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ విజయానికి చేరువగా వచ్చింది. ఆ జట్టు కూడా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. త్రిపాఠి, స్మిత్ ఆదుకోవడంతో కుదుటపడింది. చివరి ఓవర్లో విజయానికి 12 పరుగులు అవసరం కాగా, అప్పటివరకు ధాటిగా ఆడుతున్న స్టోక్స్ తొలి బంతికే రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుతిరగడంతో విజయావకాశాలు సన్నగిల్లాయి. చివరకు ఆ ఓవర్లో 4 పరుగులు మాత్రమే చేయగలగడంతో చెన్నై 8 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.

SPORTS NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *