నగ్నచిత్రాలు పంపుతావా? లేదా?

Degree Student Harassed Girl To Send Nude Pictures

స్నేహం ముసుగులో ఓ యువతికి దగ్గరై.. పైశాచికంగా ప్రవర్తించి ఫ్రెండ్‌షిప్‌కు వాల్యూ లేకుండా చేశాడు ఓ ప్రబుద్ధుడు . నగ్న చిత్రాలు పంపాలంటూ స్నేహితురాలిని వేధిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. స్నేహమంటూ వెంట పడి నరకమంటే ఏంటో చూపించిన సదరు యువకుడు చివరకు కటాకటాల పాలయ్యాడు. స్నేహమన్నాడు.. దగ్గరయ్యాడు.. షికార్లకు తిప్పాడు. తీరా తనలోని వక్రబుద్ది బయట పెట్టాడు. స్నేహం ముసుగులో ఫోటోలు దిగి వాటిని తల్లిదండ్రులకు షేర్ చేస్తానంటూ భయపెట్టాడు. అంతేకాదు నగ్న చిత్రాలు పంపాలని వేధించాడు. చివరకు సహనం నశించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సదరు యువకుడి గుట్టురట్టైంది.

నిజామాబాద్‌ జిల్లా సంత నగర్‌కు చెందిన 19 సంవత్సరాల మహ్మద్‌ రయినుద్దీన్‌.. హైదరాబాద్ శివారు ప్రాంతమైన శంకర్‌పల్లిలో ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. అక్కడి సమీపంలోని కళాశాలలో బీబీఏ డిగ్రీ కోర్సు చదువుతున్నాడు. అదే క్రమంలో స్నేహం పేరిట ఓ యువతిని నిత్యం వేధించేవాడు. తనకు అలాంటివి నచ్చవని చెప్పినా వినిపించుకోలేదు. చచ్చిపోతాను లేదా చంపేస్తానంటూ బెదిరించడంతో చివరకు అతడితో స్నేహానికి అంగీకరించింది.స్నేహంతో దగ్గరయ్యాక షికార్లకు తిప్పాడు. ఫ్రెండ్‌షిప్ ముసుగులో రెస్టారెంట్లు, సినిమాలకు తీసుకెళ్లాడు. ఆ క్రమంలో ఆమెతో కలిసి ఫోటోలు, వీడియోలు దిగాడు. అలా కొద్దిరోజులయ్యాక తనలోని చెడుబుద్ది బయటపెట్టాడు. తాను చెప్పినట్లు వినాలని లేదంటే మీ పేరెంట్స్‌కు తాము కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు పంపిస్తానంటూ బెదిరించేవాడు. దాంతో అతడి వేధింపులు సహనంగా భరించింది. అది అలుసుగా తీసుకున్న రయినుద్దీన్ మరింత రెచ్చిపోయాడు. స్నేహితుడే కదా అని నమ్మితే రివర్స్ గేర్‌లో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నప్పటికీ తాను ఏమి చేయలేని పరిస్థితి. ఇంట్లో చెబితే తనను ఎక్కడ బెదిరిస్తారోనని భయపడేది. ఆ క్రమంలో అతడి వేధింపులు ఎక్కువైనా భరించిందే తప్ప అతడని ఏమనలేకపోయింది.

భరించలేక పోలీసుల ఆశ్రయం..

ఒకసారి పేరెంట్స్‌తో కలిసి సినిమాకు వెళ్లిన సదరు యువతికి కీచక స్నేహితుడు ఫోన్ చేశాడు. తాను సినిమా చూస్తున్నానని, తర్వాత ఫోన్ చేస్తానని ఎంతలా చెప్పినప్పటికీ రయినుద్దీన్ వినిపించుకోలేదు. అప్పటికప్పుడు వాష్ రూమ్‌కి వెళ్లి నగ్న చిత్రాలు పంపాలని కోరాడు. లేదంటే పదే పదే ఫోన్ చేసి విసిగిస్తానని.. తద్వారా మీ తల్లిదండ్రులకు విషయం తెలిసిపోతుందని బెదిరించాడు. అలా బెదిరించేసరికి తనకు ఏంచేయాలో అర్థం కాని పరిస్థితి. దాంతో అతడు చెప్పినట్లే చేసింది. వాడి వేధింపులకు తలొగ్గి బాత్రూమ్‌కు వెళ్లి ఫోన్‌లో నగ్నచిత్రాలు తీసి వాట్సాప్ ద్వారా షేర్ చేసింది. ఆ ఫోటోలు తన చేతికి చిక్కితే మరింత వేధించాలని ప్లాన్ వేసిన అతడి కోరిక దాంతో నెరవేరినట్లైంది. రయినుద్దీన్ అనుకున్నట్లే సదరు యువతి భయపడి నగ్న చిత్రాలు పంపడంతో.. తనలోని రాక్షసుడిని నిద్ర లేపాడు. ఆ ఫోటోల పేరుతో మరింత భయపెట్టి ఆ యువతికి చుక్కలు చూపించాడు. వేళ కాని వేళలో ఫోన్లు చేస్తూ తన దగ్గరకు రావాలని ఇబ్బంది పెట్టేవాడు. ఇన్నాళ్లు వాడి వేధింపులు భరించిన సదరు యువతి చివరకు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు రయినుద్దీన్‌ను అదుపులోకి తీసుకుని ఆధారాలతో సహా నిలదీసేసరికి నిజం ఒప్పుకున్నాడు. చేసిన తప్పు అంగీకరించడంతో అరెస్ట్ చేసి రెండు స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

tags : friendship, nude pictures, rachakonda police station , rayinuddin , arrest

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *