మాంసపు ముద్దలుగా మృత దేహాలు…అసలేం జరిగింది?

Delhi fire Live Updates

దేశ రాజధానిలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ అగ్నిప్రమాదంలో తొలుత 10 మంది మరణించి ఉంటారని భావించారు. ఆ కాస్సేపటికే ఈ సంఖ్య 40కి చేరింది. క్రమంగా 35కు పెరిగింది. ప్రస్తుతం 43 మంది ఈ ఘోర అగ్నిప్రమాదంలో సజీవ దహనమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారు అనుమానిస్తున్నారు.

తప్పించుకునే మార్గం లేక..

న్యూఢిల్లీలోని రాణి ఝాన్సీ మార్గంలో ఉన్న అనాజ్ మండి ప్రాంతంలోని ఓ కర్మాగారంలో ఆదివారం తెల్లవారు జామున భీకర అగ్నిప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అనాజ్ మండి ప్రాంతం ఇరుకుగా ఉండటం, మంటలు చెలరేగిన వెంటనే సురక్షితంగా తప్పించుకోవడానికి అవసరమైన అత్యవసర మార్గాలు లేకపోవడం వల్ల కార్మికులు మంటల్లో చిక్కుకుని ఉండొచ్చని ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

అత్యవసర మార్గాలు లేకుండా

ఏ కర్మాగారానికైనా అత్యవసర ద్వారాలు ఉండి తీరాలనేది అగ్నిమాపక శాఖ నిబంధనలు చెబుతున్నాయి. అనాజ్ మండిలో తాజాగా మంటల బారిన పడిన కర్మాగారంలో ఇలాంటి అత్యవసర ద్వారాలు ఏవీ లేవని అంటున్నారు. అలాంటి ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉండి ఉంటే మరణాల సంఖ్య భారీగా తగ్గడానికి అవకాశం ఉండేదని, లేదా కార్మికులందరూ ప్రాణాలతో సురక్షితంగా తప్పించుకోవడానికి వీలు చిక్కేదని అంటున్నారు.

మాంసపు ముద్దలుగా..

కర్మాగారంలో మంటలు చెలరేగిన విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఢిల్లీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన మంటలను నియంత్రించే పనిలో పడ్డారు. దీనికోసం అత్యాధునిక సామాగ్రిని వారు వినియోగించారు. మంటలు వ్యాపించకుండా క్షణాల్లో జాగ్రత్తలు తీసుకున్నారు. అగ్ని కీలలను అదుపు చేసిన తరువాత లోనికి వెళ్లి చూడగా.. అక్కడి వారు మాంసపు ముద్దలుగా కనిపించారని ఢిల్లీ ఫైర్ సర్వీస్ డిప్యూటీ చీఫ్ ఫైర్ అధికారి సునీల్ చౌదరి తెలిపారు.

కర్మాగారం నుంచి 59 మందిని సురక్షితంగా..

మంటల్లో చిక్కుకున్న కర్మాగారం నుంచి 59 మందిని కాపాడామని సునీల్ చౌదరి తెలిపారు. వారిని లోక్ నాయక్ జయప్రకాశ్ ఆసుపత్రి, లేడీ హార్డింగ్, సప్ధర్ జంగ్, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రులకు తరలించామని అన్నారు. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా- ప్రస్తుతం మంటలను నియంత్రించే పనిలో ఉన్న అగ్నిమాపక సిబ్బందికి తోడుగా జాతీయ విపత్తు నిర్వహణ బలగాలను కూడా రంగంలోకి దించారు. సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి.

Delhi fire Live Updates,#DelhiAnajMandi fire Today,#ShortCircuit, A massive fire broke, Delhi fire,Anaj Mandi,Capital Delhi Fire News,Latest Delhi Fire News,Death toll rises to 43

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *