బ్లాక్ బస్టర్ లా కనిపిస్తోన్న దిల్ బేచారా

1
dil bechara trailer
dil bechara trailer

dil bechara trailer

ఆర్టిస్టులకు మరణం ఉండదు అంటారు. నిజమే.. వారు భౌతికంగా మరణించినా పాత్రల్లో జీవించే ఉంటారు. కానీ ఒక ఆర్టిస్ట్ మరణించిన తర్వాత అతను చేసిన సినిమాలు విడుదలైతే మాత్రం అది అతని అభిమానులకు అత్యంత భావోద్వేగాన్ని కలిగించే సినిమా అవుతుుంది. కంటెంట్ తో సంబంధం లేకుండా ఎంతోమంది ఇష్టపడే సినిమా అవుతుంది. కానీ కంటెంట్ కూడా అద్భుతం అనిపించేలా ఈ మధ్యే ఆత్మహత్య చేసుకుని మరణించిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మూవీ ట్రైలర్ ఇప్పుడు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. క్యాన్సర్ తో పోరాటం చేస్తోన్న ఓ అమ్మాయి. అలాంటి అమ్మాయిని ప్రేమించిన కుర్రాడు.. ఆమె ఎప్పుడు చనిపోతుందో తెలియదు. కానీ తను ఎప్పుడు చనిపోయినా అప్పటి వరకూ అంతులేని జ్ఞాపకాలను ఇవ్వాలనుకుంటాడీ కుర్రాడు. కీచులాటలతో మొదలై.. గాఢమైన ప్రేమగా మారి.. అటుపై విరహాలు, వినోదాలు, విజయాలు.. అంటూ సుశాంత్ సింగ్  రాజ్ పుత్ మూవీ దిల్ బేచారా ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందీ అనేలా ఉందీ ట్రైలర్. సుశాంత్ సరసన సంజనా సంఘీ హీరోయిన్ గా నటించిందీ చిత్రంలో.

అమాయకమైన మొహంతో తను కూడా చూడగానే ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఫాక్స్ స్టార్ స్టూడియో నిర్మించిన ఈ మూవీకి ముఖేష్ ఛాబ్రా దర్శకుడు. ప్రస్తుతం థియేటర్స్ మూతపడ్డాయి కాబట్టి.. ఈ మూవీని ఆన్ లైన్ డిజిటల్ స్ట్రీమింగ్ లో విడుదల చేయబోతున్నారు. డిస్నీ హాట్ స్టార్ లో ఈ నెల 24 నుంచి దిల్ బేచారా స్ట్రీమ్ కాబోతోంది. అయితే దిల్ బేచారా సినిమా విజయాన్ని చూడ్డానికి కానీ.. ఈ విజయం మీదుగా మరింత పెద్ద కెరీర్ నిర్మించుకోవడానికి కానీ అతను లేడిప్పుడు. అందుకే.. ఆత్మహత్య ఎప్పుడూ దేనికీ పరిష్కారం కాదు. అతని మనసులో ఏముందో కానీ.. ఈ మూవీ ట్రైలర్ తో మాత్రం ఎంతోమంది మనసులను బాధపెడుతున్నాడు సుశాంత్. తను లేకపోయినా అతను నటించిన ఈ దిల్ బేచారా మంచి విజయాన్ని సాధించాలని ఆశిద్దాం..