ED arrests Yes Bank founder Rana Kapoor
సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంకుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఆర్బీఐ. మనీలాండరింగ్ చట్టం కింద ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానాకపూర్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆదివారం తెల్లవారుజామున 4 గంటల ప్రాతంలో అరెస్టు చేసింది. కస్టడీ కోసం ఆయనను స్థానిక కోర్టు ముందు హాజరుపరుస్తోంది. ఎస్ బ్యాంక్ సంక్షోభ నివారణకు ఆ బ్యాంకులో 49 శాతం వాటాలను తీసుకునేందుకు ఎస్బీఐ ముందుకు వచ్చింది.15 గంటల పాటు రానాని విచారించిన ఈడీ ఇవాళ ఉదయం అదుపులోకి తీసుకుంది. 2 లక్షల కోట్ల డిపాజిట్లతో 1100 బ్రాంచ్‌లతో దేశవ్యాప్తంగా విస్తరించిన ఎస్ బ్యాంక్ కొంతకాలంగా సంక్షోభంలో కూరుకుపోయింది. ఆస్తుల విలువ పతనమైన అప్పులు గుదిబండగా మారడంతో చివరకు ఆర్బీఐ రంగంలోకి దిగింది. ఎస్ బ్యాంక్‌పై మారటోరియం కూడా విధించింది. కాగా, ఎస్ బ్యాంకు సీఈవో రాణాకపూర్ ఇంట్లో ఈడీ అధికారులు శనివారం ఉదయం నుండి సోదాలు నిర్వహించారు.
రాణాకపూర్ పై మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈడీ సోదాలు నిర్వహించింది. మరోవైపు, ఖాతాదారులు నెలకు రూ.50 వేలు మాత్రమే ఒక్కో ఖాతా నుంచి నగదు విత్ డ్రాయల్‌కు అనుమతినిచ్చింది ఆర్బీఐ. సెంట్రల్ బ్యాంక్.. నగదు ఉపసంహరణలపైనా పరిమితులు పెట్టింది. ఖాతాదారులు నెలకు రూ.50 వేలకు మించి తీసుకోవాలంటే ఆర్బీఐ అనుమతి తప్పనిసరి. ఇక, బ్యాంకు బోర్డును కూడా రద్దు చేశారు. అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్బీఐ మాజీ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ ప్రశాంత్ కుమార్‌ను నియమించింది. బ్యాంకుకు విశ్వసనీయమైన పునర్జీవ ప్రణాళిక అంటూ ఏదీ లేక పోవడంతో ప్రజా ప్రయోజనాలు, బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎస్ బ్యాంక్ ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ సొమ్ము భద్రం అని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఖాతాదారులు తమ డెబిట్ కార్డులు ఉపయోగించుకుని ఏ ఏటీఎం నుంచైనా డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని ఎస్ బ్యాంకు శనివార అర్థరాత్రి దాటిన తర్వాత ఓ ట్వీట్ ద్వారా ప్రకటించింది. ‘మీ ఎస్ బ్యాంక్ డెబిట్ గార్డు ఉపయోగించుకుని యస్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఎంతో ఓపిగ్గా ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపింది. దీంతో ఖాతాదారులకు భారీ ఊరట లభించినట్టయింది. దీనికి ముందు, ఎస్ బ్యాంకు లావాదేవీలపై రిజర్వ్ బ్యాంక్ అండియా మారటోరియం విధించడంతో ఒక్కసారిగా ఆ బ్యాంకు ఖాతాదారుల్లో కలవరం మొదలైంది. వెంటనే పెద్ద సంఖ్యలో బ్యాంకులు, ఏటీఎంల వద్ద క్యూలు కట్టారు. అయితే వాటిల్లో డబ్బులు లేకపోవడంతో ఖాతాదారుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.