నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో

Fake workers in Nizam Govt Hospital

షాకింగ్ …నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో నకిలీ ఉద్యోగాల దందా

ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఏకంగా 24 మందిని మోసం చేసాడో ఘరానా మోసగాడు. వారికి ఉద్యోగాలు వచ్చేసినట్టే అని నమ్మించడం కోసం ఆసుపత్రిలోనే అనధికారికంగా విధులు నిర్వహించేలా చేశాడు . కాసుపత్రులు పనితీరు పరిశీలించడానికి వచ్చిన సూపరింటెండెంట్ సదరు ఉద్యోగులు చేస్తున్న నిర్వాకం ని చూసి అవాక్కయ్యారు. దీంతో తీగలాగితే డొంకంతా కదిలింది. 24 మంది అనధికారిక ఉద్యోగుల గుట్టురట్టయింది.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాల పేరిట ఘరానా మోసం జరిగింది. ఆసుపత్రిలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న వారిని సూపరింటెండెంట్‌ గుర్తించడంతో ఈ తతంగం వెలుగు చూసింది. మంగళవారం ఉదయం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు ఆసుపత్రిలో వార్డులను పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి రోగికి ఇంజక్షన్‌ కూడా ఇవ్వడం రాకుండా పని చేస్తున్న తీరుతో అనుమానం వచ్చిన సూపరింటెండెంట్‌ అతడిని ప్రశ్నించారు. దీంతో సదరు వ్యక్తి, తనను సతీష్‌ అనే వ్యక్తి నియమించాడని, తనతో పాటు మరికొందరిని కూడా నియమించాడని చెప్పాడు. దీంతో సూపరింటెండెంట్‌ వార్డులను పరిశీలించి, ఆసుపత్రిలో పనిచేస్తున్న పది మందిని పట్టుకున్నారు. వారిని విచారించగా, సతీష్‌ అనే వ్యక్తి ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఏఎన్‌ఎం ఉద్యోగాలు ఇప్పిస్తానని మొత్తం 24 మందిని అనధికారికంగా ఆసుపత్రిలో నియమించాడని తెలిసింది. ఒక్కొక్కరి వద్ద రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు తీసుకున్నట్టు బాధితులు తెలిపారు.

ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో 24 మంది అనధికారికంగా అనుమతులు లేకుండా ఉద్యోగాలు చేస్తున్న పట్టించుకోని వైద్యశాఖ తీరు అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సూపరింటెండెంట్‌ పరిశీలనలో భాగంగా 24 మంది నకిలీ ఉద్యోగులను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అనధికారికంగా ఉద్యోగాలు చేయిస్తున్న సతీష్ అనే వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి తెలియకుండానే ఈ వ్యవహారమంతా నడిచే అవకాశం లేదు. కాబట్టి ఈ నకిలీ ఉద్యోగుల వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే ఇదే అదునుగా రాష్ట్రవ్యాప్తంగా నకిలీలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *