పుస్త‌కాల పండుగ  వ‌స్తుంది

Festival of Books In Hyderabad

– డిసెంబ‌ర్ 23 నుంచి షురూ!

– వేదిక : తెలంగాణ క‌ళా భార‌తి (ఎన్టీఆర్ స్టేడియం)

– సిద్ధ‌మ‌వుతున్న వివిధ ప్ర‌చుర‌ణ సంస్థ‌ల ప్ర‌తినిధులు

భాగ్య‌న‌గ‌రిలో ఏటా ఓ పండుగ.. ధ‌ర్నా చౌక్ స‌మీపాన తెలంగాణ క‌ళా భార‌తి పేరిట అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌హ‌ణ‌కు నోచుకునే అక్ష‌రాల పండుగ.. ఈ నెల 23 నుంచి హైద్రాబాద్ బుక్ ఫెస్టివ‌ల్.. ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి ఇప్ప‌టికే ఏర్పాట్లు మొద‌ల‌య్యాయి..వివిధ ప్ర‌చుర‌ణ సంస్థ‌ల‌కు ల‌క్కీ డిప్ ద్వారా స్టాళ్ల‌ను కేటాయించ‌నున్నారు. పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా ప్ర‌తిరోజూ సాయంత్రం సంగీత సాహిత్య కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌కు ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు.. రెండు తెలుగు రాష్ట్రాల‌కూ చెందిన క‌వులూ, ర‌చ‌యిత‌లూ, ముఖ్య‌మ‌యిన ప్ర‌చుర‌ణ క‌ర్త‌ల‌తో పాటు ప్ర‌చుర‌ణ మాధ్య‌మాల‌కు అనుబంధంగా ఉండే సంస్థ‌ల ప్ర‌తినిధులూ, డిజిట‌ల్ ఆర్టిస్టులూ, లే ఔట్ ఆర్టిస్టులూ, క‌వ‌ర్ పేజ్ డిజైన‌ర్లూ వీరితో పాటు సామాజిక‌వేత్త‌లూ, వివిధ క‌ళారంగాల‌కు చెందిన ప్ర‌తినిధులూ హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌త్యేకంగా ఓ పోస్ట‌ర్ ను రూపొందించారు..

సామాజిక‌వేత్త జూలూరి గౌరీ శంక‌ర్ నేతృత్వాన ఈ పుస్త‌క ప్ర‌ద‌ర్శ‌న‌కు ఏర్పాట్లు ముమ్మ‌రం అయ్యాయి. తెలంగాణ ప్ర‌భుత్వం త‌న‌దైన స‌హ‌కారం ఏటా అందిస్తూ వ‌స్తోంది. ఏటా ప‌ది ల‌క్ష‌ల మంది పుస్త‌క ప్రియులు ఇక్క‌డికి చేరుకుంటున్నార‌న్న‌ది ప్ర‌ముఖ ప్ర‌చురణ మాధ్య‌మం వెల్ల‌డిస్తున్న వివ‌రం. డిసెంబ‌ర్ 23న మొద‌లై జ‌న‌వ‌రి ఒక‌టితో ముగియ‌నుందీ వేడుక. ఈ ఏడాది ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో మూడు వంద‌లకు పైగా స్టాళ్ల ఏర్పాటుకు అనుమ‌తులు ఇచ్చామ‌ని నిర్వాహ‌కులు తెలిపారు. విదేశీ ప్ర‌చుర‌ణ సంస్థ‌లు సైతం ఈ ఏడాది పాల్గొన‌ను న్నాయని వెల్ల‌డించారు. కొన్ని ప్ర‌చుర‌ణ సంస్థ‌లు ప్ర‌త్యేక డిస్కౌంట్ సేల్ ను కూడా అందుబాటులోకి తేనున్నారు. ఏటా బాల సా హిత్యానికి ఆద‌ర‌ణ పెరుగుతున్న‌ద‌ని అదే రీతిన క‌థా సాహిత్యం కొన్ని పుస్త‌కాల వ‌ర‌కే అమ్ముడుపోతున్నాయ‌ని ఇక్క‌డ స్టాళ్ల‌ను నిర్వ‌హించిన కొంద‌రు చెబుతున్నారు. అదేవిధంగా డిజిట‌ల్ లైబ్ర‌రీ కాన్సెప్ట్ వ‌చ్చాక డిజిట‌ల్ రీడింగ్ పెరిగాక కూడా ముద్ర‌ణ మా ధ్య‌మంలో  కూడా పోటీ పెరిగింద‌ని, అందుకే పుస్త‌కాల అమ్మ‌కాల‌కు సంబంధించి కొంద‌రు ర‌చ‌యిత‌లూ, క‌వులూ విభిన్న మార్గాల‌నూ, వినూత్న పంథాల‌ను అనుస‌రిస్తున్నార‌న్న‌ది వారి అభిప్రాయం.
ఏడాది చివ‌రి వారంలో ఆరంభం అయ్యే ఈ అక్ష‌ర వేడుకకు అంద‌రూ ఆహ్వానితులేన‌ని, మంచి పుస్త‌కాల‌ను ఆద‌రించి, త‌మ‌ను ఆశీర్వదించాల‌ని ప‌లువురు ప్ర‌చుర‌ణ క‌ర్త‌లూ, ఎగ్జిబిష‌న్ కు సార‌థ్య బాధ్య‌త‌లు వ‌హిస్తున్న సంబంధిత ప్ర‌తినిధులు విన్న‌విస్తున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం సైతం త‌మ‌కు అందిస్తున్న స‌హ‌కారం ఎన్న‌టికీ మ‌రువలేమ‌ని అంటున్నారు. ఎగ్జిబిష‌న్ ఏర్పాటుకు ఐదేళ్లుగా ఉచితంగా స్థ‌లాన్ని కేటాయించ‌డ‌మే కాకుండా, ఇక్క‌డ ఎటువంటి  ఇబ్బందులూ తలెత్త‌కుండా త‌మ‌కు అధికార‌, అన‌ధికార యంత్రాంగం ఎంత‌గానో స‌హ‌క‌రిస్తుంద‌ని వీరు చెబుతున్న మాట. రెండు తెలుగు రాష్ట్రాల‌ల్లోనూ మాతృభాష‌కు సంబంధించి అకాడ‌మీలు ఉన్నందున ప్ర‌భుత్వం త‌ర‌ఫున క‌వుల‌కూ, ర‌చ‌యిత‌ల‌కూ మ‌రింత ప్రోత్సాహం అదేవిధంగా ప్ర‌చుర‌ణ క‌ర్త‌ల‌కూ మ‌రింత ఆర్థిక ప‌ర‌మ‌యిన చేయూత  ద‌క్కుతుంద‌న్న విశ్వాసం త‌మ‌లో ఉంద‌ని వీరు వెల్ల‌డిస్తున్న ప్ర‌గాఢ విశ్వాసం. న‌డిచే నేస్తం న‌డిచే విజ్ఞానాల‌యం పుస్త‌కం.. ప‌ల్లె ప‌ల్లెకూ పుస్త‌కం ఇవే త‌మ ప్రాధాన్యాంశాల‌ని వీరు అందిస్తున్న వివ‌రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *