పాత కారు కోసం ఘర్షణ

Spread the love

Fight for OLD Car

ఓ పాతకారు కొనుగోలు వివాదం అన్న తమ్ముడి హత్య చేసేలా చేసింది. పాత కారు కొనుగోలు అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టింది. మెకానిక్ లుగా పనిచేస్తున్న వారి వద్దకు సెకండ్ హ్యాండిల్ కారు అమ్మకానికి రావడంతో తమ్ముడు ఆ కారును కొనుగోలు చేసేందుకు అన్నయ్యపై ఒత్తిడి తెచ్చాడు. కారు కొనుగోలు చేసేందుకు డబ్బులు ఇవ్వాలని అన్నయ్యను అడగ్గా డబ్బు లేదని చెప్పాడు. దీంతో ఇరువురి మధ్య గొడవ చెలరేగింది. గొడవ కాస్త హత్యకు దారి తీసింది. క్షణికావేశంలో అన్నయ్య తమ్ముడిని దారుణంగా హత్య చేసి జైలు పాలయ్యాడు .

వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా దుండిగల్ వద్ద అన్న తమ్ముడిని దారుణంగా హత్యా చేశాడు . సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అన్నారం గ్రామానికి చెందిన జానకిరామ్‌, అరుణ దంపతులకు వినయ్‌కుమార్‌(23), కార్తీక్‌కుమార్‌(19) ఇద్దరు కుమారులున్నారు. ఆ అన్నదమ్ములిద్దరూ స్థానికంగా మేనమామ నర్సింహులు నిర్వహిస్తున్న రాజు మోటార్స్‌ షెడ్డులో మెకానిక్‌లుగా పనిచేస్తున్నారు. మూడేళ్లుగా మెకానిక్ లుగా పనిచేస్తున్న వారి ఇరువురి డబ్బు అన్న వినయ్ కుమార్ వద్ద ఉంది. అయితే ఇటీవలే ఒక పాతకారు అమ్మకానికి వచ్చింది. పాత కారు కొనేందుకు రూ.2.50 లక్షలు ఇవ్వాలని వినయ్ కుమార్ ను తమ్ముడు కార్తీక్ కుమార్ అడిగాడు. తన వద్ద రూ.40వేలకు మించి లేవని అన్న తేల్చి చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ చెలరేగింది.

మూడేళ్లుగా కష్టపడి సంపాదించింది రూ.40వేలేనా అంటూ తమ్ముడు అన్నని నిలదీశాడు. అనంతరం ఆదివారం రాత్రి 9గంటలకు బిర్యానీ తినేందుకు ఇద్దరూ మరమ్మత్తులకు వచ్చిన ఓ కారులో బయలు దేరారు. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద మళ్లీ నగదు విషయంలో గొడవ పడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన అన్నయ్య వినయ్ కుమార్ విచక్షణ మరిచి క్షణికావేశంలో కారు డిక్కీలోని ఇనుప రాడ్ తో తమ్ముడు కార్తీక్‌కుమార్‌ తలపై బాదాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. కార్తీక్ కుమార్ చనిపోవడంతో కేసు నుండి తప్పించుకోవాలని దాన్ని ప్రమాదంగా చిత్రీకరించి నమ్మించేప్రయత్నం చేశాడు వినయ్ కుమార్.

రోడ్డు ప్రమాదంలో తమ్ముడు తీవ్రంగా గాయపడ్డాడని తల్లిదండ్రులను నమ్మించి అదే కారులో దుండిగల్‌ ఓఆర్‌ఆర్‌ వద్దకు తీసుకొచ్చాడు. రక్తపు మడుగులో పడిఉన్న అతన్ని కారులో సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో గండిమైసమ్మ చౌరస్తా వద్ద 108 వాహనం రాగా అందులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే కార్తీక్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
తలపై బలమైన గాయాలు ఉండటంతో తల్లిదండ్రులు పెద్ద కుమారుణ్ని నిలదీశారు. దీంతో అసలు విషయం చెప్పుకొచ్చాడు. వినయ్ కుమార్ పై తల్లి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *