నిర్మలా సీతారామన్ 2019-20 బడ్జెట్ హైలైట్స్ ఇవే

Spread the love

Finance Minister Nirmala Sitaram 2019 -20 Budget Highlights

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2019-20 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘ముద్ర యోజన’ దేశంలో సామాన్యుల జీవితాన్ని మార్చేసిందని తెలిపారు. నిర్మాణ రంగంలో కీలకమైన సంస్కరణలు తీసుకొచ్చామనీ, దీంతో ఏడాది కాలంలోనే భారత్ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల మేర బలపడిందని చెప్పారు. భారత్ లోకి విదేశీ పెట్టుబడులు 64.37 బిలియన్ డాలర్లుగా ఉన్నాయని చెప్పారు.

బడ్జెట్ హైలైట్స్ చూస్తే.. దేశవ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానం తీసుకురానున్నట్టు చెప్పారు. విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తామని తెలిపారు. ‘జల్ వికాస్ మార్గ్’ పథకం ద్వారా అంతర్గత జలరవాణాకు అధిక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. 3 కోట్ల మంది రిటైల్ వర్తకులకు పెన్షన్ కోసం ‘ప్రధాన మంత్రి కరమ్ యోగి మాన్ ధన్ పథకం’ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏటా వార్షికాదాయం రూ.1.5 కోట్లలోపు ఉన్న వ్యాపారులు ఇందుకు అర్హులని తెలిపారు. ఈ పథకం కోసం ఆధార్, బ్యాంకు అకౌంట్ ఉంటే చాలునని తెలిపారు. లిస్టెడ్ కంపెనీల్లో ప్రజల వాటా పెంచేందుకు నిర్ణయం చేశామని చెప్పిన ఫైనాన్స్ మినిస్టర్ ఇందుకోసం సెబీతో చర్చించిన కేంద్రం, కేవైసీ నిబంధనలు సులభతరం చేయాలని సూచన చేసిందని తెలిపారు.
సెబీ పర్యవేక్షణలో సోషల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు పెట్టుబడులు(ఈక్విటీ, అప్పు, మ్యూచువల్ ఫండ్) సమీకరించేలా త్వరలో నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు.

విమానయానం, మీడియా, యానిమేషన్, ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ పెట్టుబడుల పెంపునకు అంగీకారం తెలిపారు. ఇన్సూరెన్స్ ఇంటర్ మీడియరిస్ కు 100 శాతం ఎఫ్ డీఐ(విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)కు ఆమోదం తెలిపారు. ఒకే బ్రాండ్ కు చెందిన రిటైల్ సెక్టార్ లో ఎఫ్ డీఐలకు నిబంధనలు సరళతరం చెయ్యాలని పేర్కొన్నారు. జీఎస్టీ చెల్లింపునకు పేరు నమోదు చేసుకున్నవారికి 2 శాతం పన్ను రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించారు . విదేశీ, దేశవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు విధానపరమైన సంస్కరణలు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ పీఎల్) అనే కంపెనీ ఏర్పాటు చేయ్యనున్నట్టు పేర్కొన్నారు.

ఇస్రో ప్రయోగాలు, అభివృద్ధి ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందేందుకు ఎన్ఎస్పీఎల్ ఏర్పాటు చేశామని తెలిపారు.కేంద్ర అంతరిక్ష విభాగం ఆధ్వర్యంలో ఎన్ఎస్ పీఎల్ కంపెనీ పనిచేస్తుందని ప్రకటించారు .గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ఊరు-పేదవారు-రైతు లక్ష్యంగా ‘అంత్యోద్యయ’ పథకం ప్రారంభం చేయ్యనున్నామని తెలిపారు. 2022 నాటికి 1.95 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని చెప్పారు .ప్రతీ నిరుపేద గ్రామీణ కుటుంబానికి ఇల్లు అందిస్తామని , 2022 నాటికల్లా అర్హులైన ప్రతీఒక్కరికీ ఉచిత ఎల్పీజీ కనెక్షన్ అందిస్తామని పేర్కొన్నారు. హర్-ఘర్-జల్ కింద 2024 నాటికి ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తామని , రైల్వేశాఖలో ప్రైవేటు పెట్టుబడిని ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. మత్స్యకారుల కోసం ‘ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన’ ప్రారంభ నిర్ణయాన్ని ప్రకటించారు.మత్స్యశాఖ ఆధ్వర్యంలో జాలర్ల సమస్యల పరిష్కారం కోసమే ఈ పథకం తెచ్చామని చెప్పారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా దేశంలో 97 శాతం ప్రాంతాలకు చేరుకునేలా మౌలికవసతులను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *