కొత్తింటికి ఉపశమనం

GST DECREASED ON NEW HOUSES

  • జీఎస్టీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం
  • నిర్మాణంలో ఉన్న ఇళ్లపై 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గింపు
  • అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లపై 8 శాతం నుంచి 1 శాతానికి కుదింపు
  • ఏప్రిల్ 1 నుంచి అమలు

కొత్తగా ఇల్లు కొనుక్కోవాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇళ్ల కొనుగోలుపై జీఎస్టీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ఇక అందుబాటు ధరల్లో ఉన్న ఇళ్లపై ప్రస్తుతం ఉన్న 8 శాతం పన్నును ఒక శాతానికి తగ్గించారు. రూ.45 లక్షల లోపు విలువ ఉన్న ఇళ్లు కానీ, మెట్రో నగరాల్లో 60 చదరపు మీటర్లు, ఇతర నగరాల్లో 90 చదరపు మీటర్ల వైశాల్యంగానీ ఉన్న ఇళ్లకు ఇది వర్తిస్తుంది. ఈ మేరకు జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. కొత్త విధానంలో బిల్డర్లుకు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ కెడ్రిట్‌ (ఐటీసీ) చెల్లించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఈ నిర్ణయాలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు; గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నానిర్మాణం పూర్తయినట్టు ఇంకా ధ్రువపత్రాలు రాని ఇళ్లకు 12 శాతం పన్ను విధిస్తున్నారు. కొనుగోలు చేసిన సమయానికి నిర్మాణ పనులన్నీ పూర్తయినట్టు ధ్రువపత్రం లభించి ఉంటే అలాంటి ఇళ్లపై జీఎస్టీ ఉండదు. అయితే ఇప్పటికే పనులు ప్రారంభమై, మధ్యలో ఉన్న ప్రాజెక్టులకు ఏ నిబంధనలు అమలు చేయాలన్న విషయమై చర్చించడానికి అధికారుల సంఘాన్ని ఏర్పాటు చేసినట్టు జైట్లీ తెలిపారు. వాణిజ్య అవసరాలు, దుకాణాలకు కొంత స్థలం విడిచిపెట్టే అపార్టుమెంట్ల వ్యవహారంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నదానిపైనా అధికార్ల బృందం చర్చించనుందని వెల్లడించారు. అలాగే స్థిరాస్తి రంగంలో నగదు లావాదేవీలకు అడ్డుకట్టవేయడానికి, సరఫరాదార్లలో జవాబుదారీతనం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్టు జైట్లీ చెప్పారు.

NATIONAL NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *