ఒన్ అండ్ ఓన్లీ పవన్.. ద జనసేనాని

HAPPY BIRTHDAY PAWAN

ఆయన పేరు వింటే చాలు అభిమానులు ఉర్రూతలూగిపోతారు.. ఆయన్ను చూస్తే చాలు ఉత్సాహంతో కేరింతలు కొడతారు.. ఆయన్ను కలిస్తే ఇక తమ జన్మ ధన్యమని భావించేవారు ఎందరో. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది. ఏ సినిమా ఫంక్షన్లోనైనా ఆయన పేరు మార్మోగుతుంది. ఆయన ఎవరో అర్థమైపోయింది కదూ? అవును.. పవన్ కల్యాణ్. ద పవర్ స్టార్. ద జనసేనాని కూడా. ఆయన సినిమా ఫ్లాప్ అయినా రూ.40 నుంచి రూ.50 కోట్లు వచ్చేస్తాయి. అదీ పవర్ స్టార్ సత్తా. ఇక సినిమా హిట్ అయితే ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కావడం ఖాయం. అలాంటి పవన్ కల్యాణ్.. సినిమాల్లో పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలో జనం కోసం జనసేనానిగా మారారు. జనం తరఫున గళమెత్తాలని నిర్ణయించుకుని రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2014 ఎన్నికల్లో ఎలాంటి సాయం ఆశించకుండా బేషరతుగా తెలుగుదేశం, బీజేపీగా మద్దతుగా నిలిచారు. ఏపీలో టీడీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం జరిగిన పరిణామాలతో అటు బీజేపీకి, ఇటు తెలుగుదేశానికి దూరమై.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ, వామపక్షాలను కలుపుకొని బరిలోకి దిగారు.

ఫలితాలు ఎలాగొచ్చినా, పైసా ప్రమేయం లేని రాజకీయాలను పరిచయం చేస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్నారు. అభ్యర్థులు ఎవరూ డబ్బులు పంచొద్దని గట్టిగా చెప్పారు. కొన్ని అభ్యర్థులు సొంతంగా డబ్బులు పంచినా, అది జనసేనానికి తెలియకుండానే జరిగింది. మొత్తానికి పోటీ చేసిన రెండు చోట్లా స్వయంగా ఓడిపోయినా.. పార్టీ నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలిచినా జనసేనాని నిరుత్సాహపడలేదు. తాను క్రియాశీల రాజకీయాల్లోనే కొనసాగుతానని స్పష్టంచేసి ఆ దిశగానే కదులుతున్నారు. అయితే, చంద్రుడికి సైతం మచ్చలున్నట్టు.. పవనుడి పైనా కొన్ని విమర్శలున్నాయి. ఆయన తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు. ఈ విషయాన్ని పవన్ సరిగా ఎదుర్కోలేకపోతున్నారని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇదే ప్రచారం తమ విజయావకాశాలపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. చాలాచోట్ల తెలుగుదేశం ఓటమికి తామే కారణమనే సంగతి తెలిసి కూడా అలా ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా తెలుగునాట నిఖార్సైన రాజకీయాలకు, సరికొత్త ఒరవడికి పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు. కుల, మత, డబ్బు ప్రమేయం లేని రాజకీయాలు రావాలని ఆకాంక్షించే జనసేనాని.. అనుకున్నది సాధించాలని కోరుకుంటూ.. హ్యీపీ బర్త్ డే పవర్ స్టార్.

AP POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *