అక్రమార్కులను వదిలేసి.. అమాయకులకు ఎల్ఆర్ఎస్?

HAS NEW MUNICIPAL ACT COMMENCED?

అక్రమ లేఅవుట్లు వేసి ఆర్థిక నేరాలకు పాల్పడిన వారిని వదిలేస్తారా? 

అందులో ప్లాటు కొన్నవారి వద్ద నుంచి బలవంతంగా సొమ్ము వసూలు చేస్తారా?

అక్రమ లేఅవుట్లు వేసినవారిలో ఇంతవరకూ ఎంతమందిని శిక్షించారు?

ఎన్నికలొస్తున్నప్పుడే ఎల్ఆర్ఎస్ జాతరను మొదలెడతారా?

కొత్త మున్సిపల్ చట్టం కమెన్స్ మెంట్ తేదీ జీవో ఇచ్చారా?

అది ఇవ్వకుండానే కొత్త మున్సిపాలిటీల్లో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ మొదలు పెట్టొచ్చా?

పురపాలక శాఖ రూపొందించిన ఎల్ఆర్ఎస్ జీవోలో కరువైన స్పష్టత 

మున్సిపల్ ఎన్నికల జాతరను ద్రుష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మళ్లీ ఎల్ఆర్ఎస్ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. వింతైన విషయం ఏమిటంటే.. కొత్త మున్సిపల్ చట్టంపై గవర్నర్ ఆమోదముద్ర పడింది కానీ ఇంతవరకూ చట్టం కమెన్స్ మెంట్ తేదీని ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు. వాస్తవానికి, గవర్నర్ ఆమోదం పొందాక, ప్రభుత్వం మున్సిపల్ చట్టం కమెన్స్ మెంట్ డేట్ జీవోను విడుదల చేయాలి. కానీ, అదేమీ జరగకుండానే కొత్తగా ఏర్పాటైన 73 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్రమబద్ధీకరణకు సంబంధించిన ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. కొత్త మునిసిపల్ చట్టం ఇంకా కండ్లు తెరవక ముందే ఎల్ఆర్ఎస్ అమల్లోకి వచ్చింది. అంటే, “కొత్త” చట్టం కాస్త “కోత” ల చట్టం అయినట్టేనా? అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ గొప్పగా మాట్లాడుతూ.. తనదైన శైలిలో విమర్శలను గుప్పిస్తూ మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో అక్రమాలను ఉపేక్షించేది లేదని ప్రకటించారు. అంతేకాకుండా గౌరవసభ్యులెవరూ అక్రమాలను ప్రోత్సహించవద్దని చెప్పారు. కానీ, వాస్తవానికి జరుగుతున్నదేమిటో ఇప్పుడిప్పుడే కళ్ల ముందు సాక్షాత్కరమవుతున్నది.

అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏమిటి?
గ్రామపంచాయతీ అనుమతి తో చేసిన లేఅవుట్లలలోని ప్లాట్లుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం. మరి, పంచాయతీలకు ఎప్పుడైనా లేఅవుట్లకు అనుమతించే అధికారం ఉందా? ఆ అధికారమే లేనప్పుడు అది గ్రామపంచాయతీ లేఅవుట్ ఎలా అవుతుంది మంత్రి గారు? దాన్ని ఎలా క్రమబద్ధీకరిస్తారు? సరే, ఇప్పుడు ప్రభుత్వం నియమాలకు అనుగుణంగా ఆ లేఅవుట్ ను మార్చుతూ అనుమతిస్తారనుకుందాం.. మరి, లేఅవుట్ నిబంధనలు ఏయే  సంవత్సరం నుంచి అమల్లో  ఉన్నాయో తెలుసా?

ఉదాహరణకు ఇప్పుడు హెచ్ఎండీఏ నిబంధనల్ని తీసుకుందాం.. అసలు హెచ్ఎండీఏ ఎప్పుడు పుట్టిందో తెలుసా? మరి, దానికంటే ముందు చేసిన లేఅవుట్లకు హెచ్ఎండీఏ నిబంధనలు ఎలా వర్తిస్తాయో సదరు మంత్రివర్యులే తెలియజేయాలి. అంటే దానికి హుడా నిబంధనలని అంటారు. సరే, అలా అనుకుంటే హుడా గతంలో 20 మరియు 25 ఫీట్ల రోడ్లకు అనుమతిచ్చింది కదా? మరి, ఇప్పుడు ఏ ప్రాతిపదికన తీసుకోమంటారు? అంటే 30 ఫీట్ల రోడ్డు ఉండాలనే నిబంధనలు ఏ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చాయి? ఆ లేఔట్ అయిన సంవత్సరం ను ప్రాతిపదికగా తీసుకొని.. ఆరోజు ఉన్న నిబంధనలకు విరుద్దంగా ఉన్నవాటికి ఎల్ఆర్ఎస్ వర్తింపజేస్తూ, ఆ లేఔట్ ను సవరించాలి కదా. కానీ అలా జరగలేదే.. మొత్తం గంపగుత్తాగా అన్నింటి ఒకే గాటిన కట్టి నియమాలకు లోబడి ఉన్న లేఅవుట్లోని ప్లాట్లకు బలవంతంగా డబ్బులు వసూలు చేస్తూ అక్రమ తంతుకు తెరలేపారు. ఆరోజు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంటే, నాలా వంటి రుసుము రాలేదు కాబట్టి, ఇప్పుడు తీసుకోవాలని అనుకుంటే, నిబంధనల ప్రకారం ఉన్న లేఅవుట్లకు ఈ రోజు ప్రకారం నాలా ఛార్జీలను తీసుకోవాలి కదా.. మరి, అలా జరుగుతున్నదా?

ఒక్క లేఅవుట్ అయినా వేశారా?

రోడ్లు వెడల్పు చేసి కొత్త లేఅవుట్ని అమల్లోకి తేవాలని చెబుతున్నారు. మరి,  ఇన్ని సంవత్సరాలుగా ఒక్క లేఅవుట్ అయినా అలా చేశారా? ఆ డబ్బులు అక్కడే ఖర్చు పెట్టారా? నిజానికి, ప్రభుత్వం ఒకరకంగా చెప్పాలంటే, దార్కార్ మామూళ్లను వసూలు చేసింది. సరే ప్రభుత్వానికి, రావాల్సిన డబ్బును ఇప్పుడు వసూలు చేస్తున్నారనుకుందాం. కానీ, ఎవరి దగ్గర వసూలు చేయాలి? లేఅవుట్ చేసినోడి వద్ద కదా? మరి, వారిని వదిలేసి, కష్టపడి డబ్బులు పోసి కొనుక్కున్న సామాన్యుల వద్ద వసూలు చేయడం ఏ విధంగా న్యాయం అవుతుంది జహాపనా? బహుశా దానికి సమాధానం.. లేఅవుట్ చేసిన వారు ఇప్పుడు లేరు కదా మొత్తం భూమిని ప్లాట్లు గా చేసి అమ్ముకొని పోయారు కాబట్టి, ఉన్నవాళ్లు/ కొనుక్కున్న వాళ్లే డబ్బు చెల్లింపు చేయాలని అనొచ్చు. అది నిజమే. కానీ వాళ్ళు ఆర్థిక నేరగాళ్లు.. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించలేదు. మరి అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలికదా? ఎందుకు పెట్టడం లేదు సార్? వారు ప్రస్తుతం ఆ భూమిలో లేక పోవచ్చు కానీ ఈ భూమి మీదే ఉన్నారు కదా? అంటే, ఇంకా బతికే ఉన్నారు కదా.. మరి, వారిని వదిలేసి, మళ్ళీ మందిని ముంచి కొత్త లేఅవుట్ చేయమని వదిలేసి మళ్ళీ మళ్ళీ ఎల్ఆర్ఎస్ ఇచ్చుకుంటు పోవడమంటే, ప్రభుత్వమే తప్పులను ప్రోత్సహించి, దాని నుంచి డబ్బులు దండుకుంటూ ప్రజలకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటుందని ఇట్టే చెప్పొచ్చు.

అక్రమ లేఅవుట్లను సక్రమం చేసుకుంటూ వెళితే, ఇక రాన్రానూ సక్రమ లేఅవుట్లను వేసేవారి సంఖ్య ఎందుకు పెరుగుతుంది? ఎందుకంటే, ప్రభుత్వం అక్రమ లేఅవుట్లను వేసేవారిని శిక్షించనే శిక్షించదు. అలాంటి సాహసం ఎన్నటికీ చేయదు. కాకపోతే, వాటిలో ప్లాటు కొనుక్కున్న నిరుపేద, మధ్యతరగతి ప్రజానీకం మీదే తమ ప్రతాపం చూపిస్తుంది. ఎందుకంటే, ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా, వాడు నిలదీయడు. అలాంటి సాహసం కల్లో కూడా చేయడు. ఒకవేళ, చేయడానికి ప్రయత్నిస్తే వాడి ఎల్ఆర్ఎస్ ప్రక్రియను నిలిపివేసి మూడు చెరువుల నీళ్లను తాగిస్తారు. అంటే, అక్రమ లేఅవుట్లను చేసేవారిని ప్రభుత్వం ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంటుందన్నమాట.

TELANGANA INTRODUCED LRS SCHEME

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *