Heavy rains in Hyderabad
హైదరాబాద్లో నిన్న భారీ వర్షం పడింది. సాయంత్రం 5:30 నుంచి 7 గంటల దాకా గంటన్నరపాటు భారీ వర్షం కురిసింది. ఈ సీజన్లో నగరంలో ఇదే అతిపెద్ద వాన. పాదచారులు ఇబ్బందులు పడ్డారు. వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. పలు చోట్ల ట్రాఫిక్ స్థంబించింది. గంటన్నర వర్షం అతలాకుతలం చేసింది. ఉత్తర అండమాన్ సముద్రం, పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అల్పపీడనం ఏర్పడటం.. రాయలసీమ, కోస్తాంధ్రా ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో నగరంలో ఒక్కసారిగా క్యుములోనింబస్ మేఘాలు అలుముకున్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత ఆకాశంలో ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి.
మరో రెండు రోజులు
సెప్టెంబరు 16న రెండు గంటల్లో 11.03 సెంటీమీటర్లు నమోదుకాగా, శుక్రవారం 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శని, ఆదివారాల్లో కూడా నగరంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. 12న ఉత్తర ఏపీ తీరంలో వాయుగుండం తీరాన్ని దాటే క్రమంలో వర్షాలుంటాయని చెప్పారు.