కాశ్మీర్ పరిణామాల నేపథ్యంలో పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని, వెంటనే అప్రమత్తం కావాలని నిఘా వర్గాలు హెచ్చరించాయి. భారత్ ను నేరుగా ఎదుర్కోలేని పొరుగు దేశం ఉగ్రవాదుల సాయంతో కాశ్మీర్ లో కల్లోలం సృష్టించాలని ప్రయత్నాలు సాగిస్తోందని పేర్కొన్నాయి. పైగా పుల్వామా తరహా దాడులు జరిగే అవకాశం ఉందంటూ సాక్షాత్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. పుల్వామా ఉగ్రదాడికి సూత్రధారులుగా వ్యవహరించిన జైషే మహ్మద్ సభ్యులే కాశ్మీర్ తోపాటు భారత్ లోని పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని నిఘా వర్గాలు స్పష్టంచేశాయి. ముఖ్యంగా ఢిల్లీతోపాటు రాజస్తాన్, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉగ్ర ప్రమాదం పొంచి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని ఇంటలెజిన్స్ వర్గాలు సూచించాయి. మరోవైపు స్వాత్రంత్ర్య దినోత్సవం సందర్భంగా విమానాశ్రయాలు లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ప్రధాన విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. అవాంఛనీయ ఘటనలను నిరోధించేందుకు భద్రతను ముమ్మరం చేయాలని కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో గురువారం నుంచి ఈనెల 20 వరకు హై అలర్ట్ విధించారు. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్టులోకి సందర్శకులకు అనుమతి రద్దు చేశారు.