టీ సర్కారుకు షాక్.. అసెంబ్లీ భవనాన్ని నిర్మించొద్దన్న హైకోర్టు

High Court Said NO To New Assembly Construction

ఎర్రమంజిల్ లో అసెంబ్లీ భవనాన్ని నిర్మించాలన్న టీ సర్కారు ఆలోచనలకు హై కోర్టు బ్రేకులేసింది. అసెంబ్లీ భవనాన్ని నిర్మించకూడదని హై కోర్టు తీర్పునచ్చింది. క్యాబినెట్ నిర్ణయాన్ని కొట్టివేసింది. అయితే, హైదరాబాద్ ఎర్రమంజిల్లో అసెంబ్లీ కొత్త భవనం నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ దిశలో ఎర్రమంజిల్లో ఉన్న పాత భవనాన్ని కూల్చి అదే స్థానంలో సమీకృత అసెంబ్లీ కోసం కొత్తగా భవనాన్ని నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన కూడా చేశారు. ఇదే నేపథ్యంలో కొత్త అసెంబ్లీ నిర్మాణాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలు అయింది. పిటిషనర్, ప్రభుత్వం తరఫు వాదనలు విన్న తరవాత హైకోర్టు ఇవాళ తీర్పు వెల్లడించింది.

కొత్త అసెంబ్లీ భవనం నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యం ఆద్యంతం ఎర్రమంజిల్ లోని పాత భవనం కూల్చివేత చుట్టే నడిచింది. అది హెరిటేజ్ భవనం, దాన్ని కూల్చొద్దనేది పిటిషనర్ వాదన కాగా, దానికి వారసత్వ హోదా లేదు అని ప్రభుత్వం వాదించింది. సమైక్య రాష్ట్రంగా ఉన్న సమయంలో రూపొందించిన హెచ్ఎండీఏ యాక్ట్ రెగ్యులేషన్ 13 ను ఎత్తివేస్తూ నెంబర్ 22 హెరిటేజ్ యాక్ట్ ఆఫ్ 2017 ను అమల్లోకి తెచ్చామని విన్నవించింది. రెగ్యులేషన్ 13 ప్రకారం రాష్ట్రంలో మొత్తం 126 హెరిటేజ్ బిల్డింగులు ఉన్నాయి. కాగా కొత్త చట్టం తరవాత వాటిలో కేవలం 5 భవనాలు మాత్రమే జాబితాలో మిగిలాయి. హెరిటేజ్ స్టేటస్ ఎత్తేసిన భవనాల్లో ప్రస్తుత ఎర్రమంజిల్ భవనం కూడా ఉంది. ఐతే, ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ సంపదల జాబితా నుంచి ఎత్తివేయడంతో ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉన్నాయనేది హైకోర్టు అభిప్రాయం. చట్టంలో పేర్కొన్నట్లు పురాతన భవనాల గుర్తింపు కోసం అటు జిల్లా, ఇటు జీహెచ్ఎంసీల స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయకుండానే ఎర్రమంజిల్ భవనాన్ని వారసత్వ సంపదల జాబితా నుంచి ఎలా తొలగిస్తారని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

అప్పటి వరకు ఎర్రమంజిల్ భవనాన్ని కూల్చివేసి సమీకృత అసెంబ్లీ కొత్త భవనాన్ని నిర్మించాలనే మంత్రివర్గ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాలని సూచించింది. ఇక అసెంబ్లీ కొత్త భవన నిర్మాణానికి సంబంధించి హైకోర్టు తీర్పుపై కొన్ని మీడియా ఛానళ్లలో వస్తోన్న వార్తలు సరికావని ఆర్ అండ్ బీ అధికారులు అభిప్రాయపడుతున్నారు. కొత్త భవనాలు కట్టాలా, వద్దా అనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని, విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసకోవని వాళ్ళు అంటున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల హైకోర్టు, క్యాబినెట్ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టాలని (సెట్ అసైడ్) హైకోర్టు సూచించి ఉంటుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఎర్రమంజిల్ భవనం వారసత్వ హోదాను రద్దు చేస్తూ చేసిన నిర్ణయంలో లేవనెత్తిన ప్రొసీజరల్ ల్యాప్స్ ను సవరించి, ప్రభుత్వం మరోసారి హైకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *