Hmda Warned Developers
హెచ్ఎండీఏ తాజా ప్రకటన కొందరు డెవలపర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఓఆర్ఆర్ వెంట ఇరువైపులా ఉన్న 15 మీటర్ల (50 అడుగులు) బఫర్ జోన్ ఏరియాలో ఎలాంటి తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు జరపకూడదని తాజాగా హెచ్చరించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు కేవలం బఫర్ జోన్లో పచ్చదనం పెంచడానికే అనుమతి ఉందన్న విషయాన్ని హెచ్ఎండీఏ గుర్తు చేసింది. బఫర్ జోన్ వెంట భవన నిర్మాణ అనుమతులిచ్చే సందర్భంలో మున్సిపాలిటీలు, పంచాయతీలు 15 మీటర్ల సెట్ బ్యాక్ నిబంధనల్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకుని అనుమతినివ్వాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రయివేటు వ్యక్తులు, డెవలపర్లు, ప్రభుత్వ స్థానిక సంస్థలు తప్పనిసరిగా నిబంధనల్ని పాటించాలని ఆదేశించారు. నిర్దేశించిన బఫర్ జోన్లో హోర్డింగులు, యూని పోల్స్, టెలికాం ఆపరేటర్లు, డిష్ యాంటెన్నాలు కూడా ఉండటానికి వీల్లేదన్నారు. బఫర్ జోన్ పరిధిలోని ప్రహారీ గోడలను వెంటనే గుర్తించి తొలగించాలని ఆదేశించారు. మరి, ఇప్పటికే ఈ బఫర్ జోన్లో నిర్మాణాలు కట్టిన డెవలపర్ల పరిస్థితి ఏమిటనే విషయం గురించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.