బిల్డర్ల అక్రమాలపై ‘అరుణ’ పోరాటం

HOUSEWIFE ARUNA FIGHT AGAINST BUILDERS

హైదరాబాద్లోని గోకుల్ ప్లాట్స్. ఈ ప్రాంతం హైటెక్ సిటీకి చేరువగా ఉండటం.. ఖాళీగా ఉండటంతో అక్రమార్కుల కన్ను విలువైన ఈ ప్రభుత్వ భూములపై పడింది. అంతే స్థానిక రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒక్కసారిగా రంగంలోకి దిగారు. గత పదిహేనేళ్ల నుంచి కబ్జా చేసుకుంటూ వచ్చారు. వీరి అక్రమాలకు స్థానిక మున్సిపల్ అధికారులు ఏమాత్రం అడ్డు చెప్పలేదు. రియల్టర్లు అందించే ఆమ్యామ్యాలకు అలవాటు పడి ప్రభుత్వ భూములను అప్పన్నంగా అక్రమార్కులకు అప్పగించేశారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో అక్రమ కట్టడాలు పెరిగిపోయాయి. ఆయన పేరు చెప్పుకుని కొందరు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా అక్రమ వసూళ్లకు తెరలేపారు. అంతేకాదు, స్థానిక జీహెచ్ ఎంసీ నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండా ఇష్టారాజ్యంగా అంతస్తుల మీద అంతస్తులను ఇరుకిరుకు గల్లీల్లో కడుతున్నారు. అంతంత భారీ స్థాయిలో కట్టడాలకు సరిపడా డ్రైనేజీ ఎలా సరిపోతుందో ఎవరికీ అర్థం  కావడం లేదు. ఈ అక్రమ తంతుకు అడ్డుకట్ట వేయాలని, బిల్డర్లు ఇష్టానుసారంగా మురికి కాలువ, మ్యాన్ హోల్ లు నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ 48 గంటలుగా మురికి కాలువ గుంతలో అరుణ అనే గృహిణి నిరసన దీక్ష చేపట్టింది. మియపూర్ గోకుల్ ప్లాట్స్ లో ఇష్టానుసారంగా మురికినీటి కాల్వలను నిర్మిస్తుండటం వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం ఖాయమని.. వీటిని ప్రణాళికాబద్ధంగా నిర్మించాలని అధికారుల్ని కోరినా పట్టించుకోవడం లేదు. దీంతో, అరుణ అనే గృహిణి వినూత్న నిరసన చేపట్టింది. చందానగర్ డిప్యూటీ కమిషనర్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్, పోలీస్ అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 48 గంటలైనా అధికారులు స్పందించడం లేదంటే.. గోకుల్ ప్లాట్లు, గోపాల్ నగర్ లో అక్రమాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జీహెచ్ ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Hyderabad Illegal Buildings

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *