ఎన్ని హామీలు అమలు?

How Many Promises Fulfilled In AP?

ప్రజల సమస్యలన్నింటినీ చాలా దగ్గరగా చూశానని, వాటన్నింటికీ సమాధానంగా మేనిఫెస్టో తీసుకువచ్చానని ఏపీ సీఎం జగన్ చెప్పారు. అప్పుడు కూడా కులం, మతం, రాజకీయం చూడకుండా, తనకు ఓటు వేయకపోయినా సరే, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందాలని తలంచానని తెలిపారు. పాదయాత్ర తర్వాత మేనిఫెస్టో విడుదల చేశామని, అది కూడా కేవలం రెండు పేజీలతోనే విడుదల చేశామని గుర్తు చేశారు. ‘ప్రజలకు నవరత్నాలు తీసుకుపోతే వారి జీవితాలు బాగుపడతాయని నమ్మాను. ఏడాది కాలంలోనే దాదాపు 90 శాతం హామీలు నెరవేర్చానని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం పేర్కొన్నారు.

ఎన్ని హామీలు అమలయ్యాయి?
‘అది ఒక వాగ్ధానపత్రం. అది 5 ఏళ్లకు అయితే, తొలి ఏడాది అమలు చేసినవి ఎన్ని? అమలుకు సిద్ధంగా ఉన్నవి ఏవని లెక్కలు వేస్తే.. మొత్తం హామీలు 129 అయితే, వాటిలో అమలైనవి 77. డేట్లు ఇచ్చి సిద్ధంగా ఉన్నవి మరో 36. అంటే 90 శాతం వాగ్ధానాలు దాదాపు అమలు. ఇంకా అమలుకు సిద్ధం. ఇంకా మిగిలి ఉన్నవి కేవలం 16 హామీలు మాత్రమే. అవి కూడా అమలుకు పరుగులు పెట్టిస్తాను. మేనిఫెస్టోలో లేకపోయినా ప్రజల అవసరాల కోసం చేసినవి మరో 40 ఉన్నాయి. ఇది తొలి ఏడాది నేను పెడుతున్న సంతకం. రాబోయే రోజుల్లో గ్రామ వలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి మేనిఫెస్టో, బుక్‌ పంపిస్తాం. అవన్నీ మేము చేశామా? లేదా; అన్నది మీరే లెక్క చూసుకోండి’ అని సీఎం స్పష్టం చేశారు.

లబ్ధిదారులు ఎందరు?:
‘ఈ ఏడాదిలో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు 3,58 కోట్ల మంది కాగా, వారి వారి ఖాతాల్లో రూ.40,627 కోట్లు జమ చేశాం. పెన్షన్‌ కోసం నెలకు రూ.1500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గతంలో ఆ ఖర్చు రూ.400 కోట్లు మాత్రమే. గతంలో పెన్షన్‌ రూ.1000 కాగా ఇప్పుడు రూ.2250 ఇస్తున్నాం.  ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.686 కోట్లు కూడా చెల్లించాం. ఇంకా ఆరోగ్య ఆసరా అని కొత్త పథకం చేపట్టాం’. ‘విద్యాదీవెన, వసతి దీవెన. పిల్లల చదువులకు భరోసా. కంటి వెలుగు. నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, లా నేస్తం, గోరుముద్ద, అక్కా చెల్లెమ్మలకు సున్నా వడ్డీ రుణాలు వంటి పథకాలు అమలు చేస్తున్నాం. మొత్తం రూ.40,627 కోట్లు నగదు బదిలీ ద్వారా 3,58 కోట్ల మందికి లాభం చేశాం’. ‘వారిలో 1.78 కోట్ల మంది బీసీలకు రూ.19,309 కోట్లు, 61.28 లక్షల ఎస్సీలకు రూ.6500 కోట్లు ఖర్చు చేశాం. 18.40 లక్షల ఎస్టీలకు రూ.2136 కోట్లు, 19,05 లక్షల మైనారిటీ సోదరులు, అక్కాచెల్లెమ్మలకు రూ.1722 కోట్లు,  77.84 లక్షల ఇతరులకు రూ.10,768 కోట్లు ఖర్చు చేశాం’ అని ముఖ్యమంత్రి వివరించారు. వాటిలో ఎక్కడా అవినీతికి తావు లేదని, నిధుల మళ్లింపు లేదని చెప్పారు. అదే విధంగా బ్యాంకులు ఆ మొత్తం లబ్ధిదారుల పాత బాకీల కింద జమ చేసుకోకుండా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. రూ.39 వేల కోట్లు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు అన్న సీఎం, అసలు ప్రభుత్వం అంటే అదేనా? ప్రశ్నించారు. గత ప్రభుత్వం మొత్తం రూ.2.60 కోట్ల అప్పులు చేసిందన్న ఆయన, వాటి వడ్డీతో పాటు, విద్యుత్‌ సంస్థలకు పెట్టిన బకాయిలు మరో రూ.20 వేల కోట్లు అని చెప్పారు.

Ap CM Jagan Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *