రోడ్లు ఛిద్రం.. జర భద్రం

Hyderabad Roads damaged

హైదరాబాద్‌ మహానగరంలో రోడ్ల నిర్మాణం కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా రోడ్లు బాగు పడటం లేదు. నాణ్యతా లోపం కారణంగా వర్షాలకు తారు రోడ్లన్నీ పాడై గుంతలమయంగా దర్శనమిస్తున్నాయి. ఇసుక, కంకర తేలి వాహనదారులను ప్రమాదాల్లోకి నెట్టెస్తున్నాయి. ఓ వైపు నగరంలో వాయు కాలుష్యంపై పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, నివారణ కోసం చేపడుతున్న చర్యలు కూడా శూన్యం. చిన్నాపాటి వర్షానికే సిటీ రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. దీంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం కంటే రోడ్డు బాగు లేకపోవడం మూలంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని సిటీ జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు… రోడ్లపై పేరుకుపోయే దుమ్మును పీల్చడం వల్ల నేరుగా ఊపిరి తిత్తుల్లో చేరడంతో ప్రజలు శ్వాసకోశ, పొడిదగ్గు వ్యాధుల బారిన పడుతున్నామని తమ బాధను వ్యక్తం చేస్తున్నారు.

గ్రేటర్ పరిధిలో మొత్తం 9 వేల కిలోమీటర్లకుపైగా రోడ్లు ఉన్నాయి. ఇందులో ప్రధాన రహదారుల మార్గాల్లోని 709 కి.మీ మాత్రమే. ఇందులో కొన్ని రోడ్ల నిర్వహణ ప్రైవేట్ ఏజెన్సీలు చేపడితే, మరికొన్ని జీహెచ్ఎంసీ చూస్తోంది. గత నాలుగైదు రోజులుగా వర్షాలు పడుతుండటంతో వాహనదారులు, సిటీ జనాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని రోడ్లపై గుంతలు పడటమే కాకుండా, కుంగిపోతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు రోడ్ల మరమ్మతుల కోసం శాశ్వాత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *