యూటీగా హైదరాబాద్?

HYDERABAD UT?

హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భాగ్యనగరాన్ని యూటీ చేసే విషయంపై కేంద్రంలోని బీజేపీ తీవ్రంగా ఆలోచిస్తోందని కాంగ్రెస్ నేత చింతా మోహన్ బాంబు పేల్చారు. మహారాష్ట్ర ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటుందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి హైదరాబాద్ ను యూటీగా చేసే విషయంపై బీజేపీ ఎప్పటి నుంచో ఆలోచిస్తోందని ప్రచారం జరుగుతోంది. అధికార టీఆర్ఎస్ తోపాటు ఎంఐఎంను ఇరుకున పెట్టాలంటే అదే మార్గమని కమలనాథులు వ్యూహాలు పన్నుతున్నట్టు వార్తలొచ్చాయి. 2022లో జమిలి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్న కేంద్రం.. పనిలో పనిగా హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని భావిస్తున్నట్టు విశ్లేషణలొచ్చాయి. అయితే, ఇది జరిగే అవకాశం ఉందా అని అడిగితే.. ఇందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

రాష్ట్ర విభజన సమయంలోనూ హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదన వచ్చిందని, ఇందుకు తెలంగాణ ప్రజానీకంతోపాటు ఏ పార్టీ కూడా అంగీకరించలేదని గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ లేని తెలంగాణ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే అని.. హైదరాబాద్ తో కూడిన తెలంగాణ మాత్రమే కావాలని అప్పట్లో ఉద్యమకారులంతా ముక్తకంఠంతో నినదించారు. దీంతో అప్పటి యూపీఏ సర్కారు ఇలాంటి ప్రయోగాలకు వెళ్లకుండా హైదరాబాద్ ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తూ రాష్ట్రాన్ని విభజించింది. ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దేశంలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేయాలనే వ్యూహంతో ముందుకు కదులుతోంది. ఇందులో భాగంగానే జమిలి ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. అలాగే తెలంగాణలో బలపడాలంటే హైదరాబాద్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సూచనలతో ఈ ప్రాంతాన్ని యూటీ చేయాలని భావిస్తోందంటూ వార్తలు వచ్చాయి. కానీ బీజేపీ అలాంటి సాహసం చేయకపోవచ్చనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. హైదరాబాద్ ను యూటీ చేయడమంటే తేనెతుట్టెను కదపడమేనని.. ఇందుకు తెలంగాణ ప్రజలు సైతం అంగీకరించే అవకాశం ఉండదని అంటున్నారు. ఇవన్నీ కేవలం ఊహాజనిత ప్రచారాలేనని, బీజేపీకి అలాంటి ఆలోచన లేదని చెబుతున్నారు.

TS POLITICS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *